దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిన తరువాత ప్రస్తుతం రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న విషయం విదితమే. మే 9వ తేదీన కోవిడ్ సెకండ్ వేవ్ పీక్ దశకు చేరుకుంది. ప్రస్తుతం రోజూ 80వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. జూన్ చివరి వరకు కోవిడ్ రెండో వేవ్ అంతం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మూడో వేవ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. ఆ దశలో కోవిడ్ మరింత తీవ్రరూపం దాలుస్తుందని నిపుణులు ముందే హెచ్చరిస్తున్నారు. కనుక భారత్ కోవిడ్ మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే..
1. కోవిడ్ మూడో వేవ్‌ను రాకుండా అడ్డుకోలేం. కానీ కోవిడ్‌ను నియంత్రించవచ్చు. అందుకు ఒక్కటే మార్గం టీకా. టీకాలను ఎంత ఎక్కువ మందికి వేస్తే అంత ఎక్కువ స్థాయిలో కోవిడ్ మూడో వేవ్‌ను అడ్డుకోవచ్చు. కోవిడ్ మూడో వేవ్ నవంబర్ వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కనుక అప్పటి వరకు వీలైనంత మందికి టీకాలను వేస్తే మూడో వేవ్ ప్రమాదం నుంచి చాలా వరకు బయట పడవచ్చు. కనుక మనముందున్న మొదటి మార్గం టీకాలను ఎక్కువ మందికి వేయడం. దాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది.
2. ఇక రెండో వేవ్ తగ్గిందని ఆంక్షలను సడలిస్తున్నారు. మళ్లీ కొన్ని రోజుల్లో సాధారణ స్థితి వస్తుంది. కానీ మూడో వేవ్ వస్తే.. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది కనుక.. కేసులు పెరుగుతున్నట్లు ఏమాత్రం అనిపించినా సరే వెంటనే మళ్లీ లాక్‌డౌన్‌లను అమలు చేయాలి. దీంతో కోవిడ్‌ను చాలా వరకు కట్టడి చేయవచ్చు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇది మన ముందున్న రెండో మార్గం.
3. ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ బారిన పడిన పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడో వేవ్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతుంది కనుక వారికి చికిత్స అందించేందుకు మెరుగైన సదుపాయాలను కల్పించాలి. ముఖ్యంగా ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చూడాలి. ఉచిత వైద్యం అందించాలి. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలి. దీని వల్ల కోవిడ్ మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
4. మూడో వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉందని చెబుతున్నారు కనుక వారి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. చిన్నారుల్లో కోవిడ్‌పై అవగాహనను పెంచాలి. మాస్కులను ధరింపజేయాలి. భౌతిక దూరం పాటించేలా చూడాలి. శానిటైజర్లను ఉపయోగించమని చెప్పాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూడాలి.
ఈ మార్గాలను అనుసరిస్తే కోవిడ్ మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.