మస్ట్ రీడ్: ఎన్ కౌంటర్ – ఉరి సరే కానీ…

-

“మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు” అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమవుతున్నాయి! “కామా తురాణాం నభయం.. నలజ్జ” అని మన పెద్దలు చెప్పినమాటలు నిజమవుతున్నాయి! దిశ, చైత్ర, వరంగల్ లో మైనర్ బాలిక, హైదరాబాద్ లో తొమ్మిదేళ్ల చిన్నారి, చిత్తురులో ఇద్దరు బాలికలు, తణుకులో ఐదేళ్ల బాలిక… పేరు ఏదైనా, ఊరు మరేదైనా.. మహిళలపైనా, పసిపిల్లలపైనా మృగాళ్లు విరుచుకుపడుతూనే ఉన్నారు.

చిన్న పిల్లలు అని కూడా చూడకుండా, అభం శుభం తెలియని చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చాక్లెట్ ఆశ చూపి కొందరు.. బిస్కట్లు ఇస్తామని మరికొందరు.. ఆడుకుందాం రమ్మని ఇంకొందరు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆపైకొందరు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు! పసిపిల్లలన్న కనికరం కూడా లేకుండా కామవాంచ తీర్చుకుంటున్నారు!

నిర్భయ చట్టం ఉందన్నా.. భయం ఉండడంలేదు. దిశ యాప్ ఉందన్నా.. లెక్కలేదు. ఎన్ కౌంటర్ చేస్తామన్నా.. ఊరుకోడంలేదు. 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే, ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా.. ఆగడం లేదు. ఆ టైమ్‌ కి అది జరిగిపోవాల్సిందే.. ఆ తరువాత సంగతి తరువాత! ప్రస్తుత సమాజంలో “అవకాశం” కోసం చూస్తున్న మృగాడి మనస్థత్వం ఇలానే ఉంది!

దీంతో… చిన్నారులను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తి మీద సాములాగా తయారయ్యింది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ కామాంధుడు ఏ రూపంలో వస్తాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఉరిశిక్ష వేసినా, ఎన్ కౌంటర్ చేసినా కూడా మారని పరిస్థితి మృగాడి మస్తిష్కంలో ఎందుకు పాతుకుపోయింది? ఎందుకు మారకుంది?

చట్టంలో మార్పులు చేసినా…:

Need-To-Change-Laws

2012లో నిర్భయ ఘటన అనంతరం, అత్యాచారాలకు అత్యధికంగా మరణశిక్షను విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ శిక్షతో నేరస్తులు భయపడిపోతారని, తద్వారా అత్యాచారాలు తగ్గుతాయని భావించారు. కానీ… చట్టం చేసిన 2012లో అత్యాచారాల సంఖ్య 24,923 గా ఉండగా… 2015లో 34,651.. 2016లో 38,947లుగా పెరిగిపోయింది! అంటే… ఉరి తీస్తామన్నా కూడా మృగాడికి భయం రావడంలేదు! చట్టాలపై అవగాహన లేదా? పోలీసు వ్యవస్థ అంటే భయం లేదా? కారణం ఏదైనా… వారు ఆగడం లేదు!

మానసిక రుగ్మత ఒక కారణం:

Mental disorder

అయితే… “పెడి ఫిలియస్‌” అనే మానసిక రుగ్మత ఉన్న వ్యక్తులు చిన్న పిల్లలతో సెక్స్‌ చేయాలని కోరుకుంటారు. దీనిలోనే మరొక విభాగం ఇన్‌ సెక్స్‌ అనే రుగ్మత ఉన్నవాళ్లు… రక్త సంబంధీకులైన బాలికలతో సెక్స్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు” మానసిక వైద్యులు చెబుతున్నారు! వెలుగులోకి వచ్చినవే కాదు.. రానివి ఇంకా చాలా ఉన్నాయనే మాటలు ఈ సందర్భంగా ఆఫ్ ద రికార్డ్ వెళ్లిబుచ్చుతున్నారు!

ఆడపిల్లల తల్లితండ్రులు…:

How to Calm an Upset or Angry Child

ఈ విషయంలో తల్లితండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది! రోజు వారి పనుల్లో భాగంగా చాలా మంది వ్యక్తులతో పిల్లలు కలుస్తుంటారు. ఇలాంటి వారిలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. వారిలో ఉన్న నైజాన్ని పిల్లలు పసిగట్టగలగాలి. తద్వారా వారికి ఏదైనా విచిత్రమైన పరిస్థితి ఎదురుపడితే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాలి. అదేవిధంగా.. పిల్లలకు మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత.

మగపిల్లల తల్లితండ్రులు…:

boy parenting

మగపిల్లల విషయంలో… తల్లిదండ్రుల పెంపకం, అతి గారాభం పిల్లలను నేరస్థులుగా మారుస్తాయని చెబుతుంటారు మానసిక వైద్యులు! కాబట్టి… పిల్లలను ఇంటర్నెట్‌, టీవీలకు వీలైనంత దూరంగా ఉంచడం.. అలాగే సెక్స్‌ అంశాలు పిల్లల మధ్య చర్చకురాకుండా చూసుకోవడం.. సెక్స్‌ దృశ్యాలు అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడటం వంటివి కనీస జాగ్రత్తలని చెబుతున్నారు!

మత్తుపదార్థాలు – ప్రభుత్వాలు:

Drugs

బాలికలపైనా, మహిళలపైనా జరుగుతున్న అత్యాచారాలకు మృగాడి మానసిక పరిస్థితి ఎంతకారణమో… ఆ సమయంలో వాడి మానసిక స్థితిపై మత్తుపదార్థాల ప్రభావం కూడా అంతే కారణమనే వాదన రోజు రోజుకీ పెరిగిపోతుంది! సరైన నిఘా వ్యవస్థ లేకనో, అధికారుల అలసత్వం వల్లనో, ప్రభుత్వ పెద్దల పాత్రవల్లనో కానీ… రోజు రోజుకీ సమాజంలో మత్తుపదార్థాల వినియోగం పెరిగిపోతుంది! ఈ విషయంలో ప్రభుత్వాలు అత్యంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

తమ పిల్లాడు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నాడనే విషయం తల్లితండ్రులు గ్రహించిన వెంటనే… తిట్టడం, కొట్టడం కంటే ముందు.. సైక్రియాటిస్టుని సంప్రదించే పనికి పూనుకోవాలి. అవసరమైతే.. ఆ ప్రదేశాన్ని తెలుసుకుని పోలీసులకు – మీడియాకు తెలియజేయాలి!

ప్రజాగ్రహంలో న్యాయం ఉంది. కానీ…:

raise-voice

అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. “నిందితులను ప్రజలే శిక్షించేలా అవకాశం కల్పించాలని.. నడిరోడ్డుపై రాళ్లు, కట్టలతో కొట్టి చంపాలని.. బహిరంగంగా ఉరి తీయాలని.. గల్ఫ్ చట్టాలు అమల్లోకి తేవాలని.. తప్పులు బహిరంగంగా చేస్తున్నప్పుడు – శిక్ష మాత్రం రహస్యంగా ఎందుకు వేయాలని” పలువురు మాట్లాడుతుంటారు. వారి ఆవేదనలో అర్థం ఉంది.. వారి ఆవేశంలో న్యాయం ఉంది. ఆ విధంగా చేయాలనే మాటలు కూడా కరెక్టే! కానీ… అదొక్కటే సరిపోదన్న విషయం అంతా గ్రహించాలి! అది చూసేవారికి, బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనే కానీ… సమాజానికి మాత్రం శాస్వత ప్రయోజనం కాదు. అదొక్కటే రేపటి రోజున మరో ఆడబిడ్డకు పూర్తి ధైర్యం కాలేదు!

ఐక్యరాజ్యసమితి సూచన:

police

అయితే… “ఐక్యరాజ్య సమితి అంచనా మేరకు ప్రతి 454 మందికి ఒక పోలీసు అధికారి ఉండాలి. కానీ హోం శాఖ 2016లో వెలువరించిన నివేదిక ప్రకారం మనదేశంలో 514 మందికి ఒక పోలీసు అధికారి మాత్రమే ఉన్నారు”! వారిలో సగం మందీ బందోబస్తులకే పరిమితం అవుతున్నారనే కామెంట్ ఉంది! ఇదే క్రమంలో… “ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాలి. కాని మనదేశంలో ఆ సంఖ్య 19 మాత్రమే ఉంది”.

దీంతో… ప్రభుత్వాలకు నిజంగా పిల్లలకు, మహిళలకు న్యాయం లభించాలని భావిస్తుంటే.. కొత్త చట్టాలు చేయడానికి బదులు, క్రిమినల్ న్యాయవ్యవస్థను సంస్కరించి, ప్రస్తుతం ఉన్న చట్టాలనే “సమర్థంగా” అమలు చేయాలని సూచిస్తున్నారు మేధావులు!

ఫలితంగా… తల్లితండ్రులు – ప్రభుత్వాలు – సమాజం… అంతా కలిస్తేనే, ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించగలిగితేనే.. ఇవి అరికట్టబడతాయనే మాట బలంగా వినిపిస్తుంది!

– CH Raja

Read more RELATED
Recommended to you

Latest news