ఏపీలో తమ పార్టీ బలంగా మారుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ పరిణామాలను గమనించిన వైసీపీ బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గాను తమ పార్టీలోకి కూడా ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తుందని తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ తాను ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే నవరత్నాలను అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా జగన్ ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదు. మరోవైపు ఇటు తెలంగాణలో టీఆర్ఎస్, అటు ఏపీలో బీజేపీలు ప్రతిపక్ష నాయకులకు గాలం వేస్తున్నాయి. ఆయా పార్టీల్లోకి జోరుగా ఇతర పార్టీల నాయకులు వలస వెళ్తున్నారు. దీంతో వైసీపీ కూడా వలసలకు గేట్లు తెరవాలని ఆలోచిస్తున్నదట.
ఏపీలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందనే చెప్పవచ్చు. చేతిలో అధికారం ఉండడంతో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు కావల్సినన్ని అవకాశాలు ఇప్పుడు వైసీపీకి పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. అదే సమయంలో పార్టీ పటిష్టత కోసం కూడా ప్రణాళికలు అమలు చేయాలని జగన్‌ను సీనియర్ వైసీపీ నేతలు కోరారట. దీంతో జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. ఓ వైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఓటు బ్యాంక్ మరింత పటిష్టమవుతుందని, దీంతో ఏపీలో తిరుగులేని పార్టీగా ఉండవచ్చని పలువురు వైసీపీ నేతలు జగన్‌కు చెప్పారట. దీంతో జగన్ ఇప్పుడు ఇతర పార్టీలకు చెందిన నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారని తెలిసింది.
అయితే ఏపీలో ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకుంటూ సందడి చేస్తోంది. దీంతో ఏపీలో తమ పార్టీ బలంగా మారుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ పరిణామాలను గమనించిన వైసీపీ బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గాను తమ పార్టీలోకి కూడా ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తుందని తెలిసింది. తాము ఇప్పటి వరకు మౌనంగా ఉండబట్టే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారని, అయితే రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే.. ఇదే సరైన సమయమని.. ఆ పార్టీలోకి ముఖ్య నేతలు వెళ్లకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అందుకనే ఇప్పుడు వైసీపీ ఇతర పార్టీల నేతలకు వలసల గేట్లు తెరిచిందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటి వరకు పలువురు టీడీపీ నేతలతోపాటు గతంలో వైసీపీలో ఉండి టీడీపీలో చేరిన నేతలు కూడా వైసీపీలోకి మళ్లీ రావాలని చూస్తున్నారట. కానీ జగన్ అందుకు సుముఖంగా లేకపోవడంతో వారు బీజేపీలో చేరాలని చూస్తున్నారట. అయితే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే.. వైసీపీ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీలకు చెందిన నాయకులను వైసీపీలో చేర్చుకుంటే.. అది తమకు కలసివస్తుందని పలువురు వైసీపీ నేతలు జగన్‌కు చెప్పారట. దీంతో జగన్ ఒకప్పటి వైసీపీ నేతలతోపాటు ప్రస్తుతం టీడీపీలో ఉన్న పలువురు పెద్ద తలకాయలను కూడా వైసీపీలో చేరేలా ప్రణాళికలు రచిస్తున్నారట.
అయితే ఇప్పటి వరకు ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసీపీలో చేరలేదు. కానీ ఇకపై జోరుగా వైసీపీలోకి వలసలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక గతంలో వైసీపీలో ఉన్న 23 మంది మాజీ ఎమ్మెల్యేలను కూడా తిరిగి పార్టీలో చేర్చుకుంటే ప్లస్ అవుతుందని పలువురు వైసీపీ నేతలు జగన్‌కు చెప్పారట. దీంతో జగన్ కూడా అందుకు ఓకే అన్నారట. ఈ క్రమంలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని అనుకుంటున్నారు. అలాగే పలువురు మాజీ మంత్రులు కూడా వైసీపీలో చేరుతారని తెలిసింది. ఈ క్రమంలో ఏపీలో ఎట్టి పరిస్థితిలో బీజేపీని ఎదగకుండా చేయాలని వైసీపీ ఆలోచిస్తున్నదట. అందులో భాగంగానే అతి త్వరలో వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందని తెలిసింది. అదే జరిగితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నేతలు వైసీపీలోకి క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏపీలో ముందు ముందు ఎలాంటి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది..!