నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 12,075 బ్యాంక్ ఉద్యోగాలు రెడీ..!

-

ఇన్ట్సిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబిపిఎస్) క్లరికల్ కేడర్ పోస్టుల కోసం ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ‌ రంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో తెలంగాణ కు 612, ఆంధ్రప్రదేశ్ కు 777 పోస్టులు కేటాయించారు. క్లర్క్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కోసం కామన్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ఇన్ట్సిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ibps.in లో విడుదల చేసింది.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2019 నోటిఫికేషన్ ద్వారా వెళ్లి త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీసెస్‌ కేటగిరీ వారికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి.

ఇన్ట్సిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ 2019 డిసెంబర్ 7, 8, 14 మరియు 21 తేదీలలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తుంది. మొదటి విడత (ప్రిలిమినరీ) ఆన్‌లైన్ రాత పరీక్షలను డిసెంబ‌రులో, రెండో విడత (మెయిన్) రాతపరీక్షలను 2019 జనవరిలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే.. మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు.

అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. అభ్య‌ర్థి ఏ రాష్ట్రానికైతే ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నాడో ఆ రాష్ట్ర స్థానికభాషపై పట్టు ఉండాలి. మాట్లాడటంతోపాటు చదవడం, రాయడం కూడా తెలిసి ఉండాలి.

వయసు: 01.09.2019 నాటికి 20 – 28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. 02.09.1991- 01.09.1999 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ప‌రీక్ష విధానం: అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్ రాతపరీక్షలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ప్రిలిమినరీలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ ౩౦, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సమయంలో 100 ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉంటుంది.

మెయిన్స్ లో 190 ప్రశ్నలతో పేపర్ ఉంటుంది. 200 మార్కులు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్స్ అవేర్నెస్ 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకు ఉంటాయి. సమయం 160 నిమిషాలు ఉంటుంది.

ప‌రీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్-  విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం.

తెలంగాణ–  హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు మాత్రం రూ.100.

Read more RELATED
Recommended to you

Latest news