బిగ్‌బాస్ 3 సీజన్ ముగిసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలే గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో బిగ్‌బాస్ 3కు ముగింపు పలికారు బిగ్‌బాస్ హోస్ట్ టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. 105రోజులు జనరంజకంగా సాగిన ఈ రియాల్టీ షో చివరికి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగలగా, చివరి రోజు ఎపిసోడ్‌లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. చివరి రోజు ఎలిమినేట్ అయినవారిలో నటుడు వరుణ్ సందేశ్, అలీ రేజాతో పాటు ప్రముఖ డ్యాన్సర్ బాబా భాస్కర్ ఉన్నారు. ఇక ఇద్దరు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలే కు మిగిలారు. అందులో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్, నటీ శ్రీముఖీ. ఇద్దరిలో శ్రీముఖి రన్నరర్‌గా నిలువగా, రాహుల్ విన్నర్‌గా నిలిచి బిగ్‌బాస్ 3 ట్రోపీలో పాటుగా రూ.50లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు.
అయితే ఇందులో బాబా భాస్కర్ చివరి ముగ్గురు ఫైనలిస్టుల జాబితాలో ఉండి ట్రోపీకి రెండు మెట్ల దూరంలో ఆగిపోయారు. అయితే బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి ప్రవేశించిన 17మంది కంటెస్టెంట్లలో అత్యంత పెద్ద వయస్సు ఉన్న కంటెస్టెంట్ బాబా భాస్కర్ కావడం విశేషం. రియాల్టీ షో బిగ్‌బాస్ 3 సీజన్‌లో ఫైనల్ 3లో ఒకరిగా నిలిచిన బాబా భాస్కర్ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 27, డిసెంబర్ 1973న చెన్నైలో జన్మించారు బాబా భాస్కర్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన బాబా భాస్కర్‌కు చిన్ననాటి నుంచే సినిమాల్లో ప్రవేశించాలనే కోరిక మెండుగా ఉండేది.
అయితే తన 9వ ఏట నుంచే డ్యాన్స్ అంటే తెగ ఇష్టపడే ఇతడు డ్యాన్స్ నేర్చుకుని ముందుగా తమిళలో డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్న పాల్ రాజ్ వద్ద శిష్యుడిగా చేరారు. తరువాత మాస్టర్ శివశంకర్ వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయి ఆయన వద్ద 9 ఏండ్లు పనిచేశారు. తరువాత మాస్టర్ రాజు సుందరం తన టీమ్‌లో చేరితే భారీ పారితోషికం ఇస్తానని చెప్పడంతో ఆయన టీమ్‌లో జాయిన్ అయిపోయారు. రాజు సుందరం దగ్గర ఐదేండ్లు పనిచేసిన బాబా భాస్కర్ సౌత్ ఇండియాలో ఎందరో స్టార్ హీరోలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తనదైన శైలీలో పనిచేశారు.
అయితే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేయడం, అది రజనీకాంత్‌కు నచ్చడం, దీంతో రోబో సినిమాకు పూర్తిస్థాయి కొరియోగ్రాఫర్‌గా మారడం చకచకా జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. తన చిరకాల కోరిక మెగాస్టార్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేయాలనేది. అయితే బాబా భాస్కర్ కుటుంబ నేపథ్యం చూస్తే ఆయన ప్రేమించిన అమ్మాయి ఓ రోజు అన్నయ్య అనడంతో కలత చెందిన బాబా భాస్కర్ చివరికి అమె చేతనే ఐ లవ్యూ అనిపించుకుని తన సత్తా ప్రేమను దక్కించుకుని, అమెనే పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
బాబా భాస్కర్ ఓ తమిళ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఇక తన కొరియోగ్రఫీతో ఫిలింఫేర్ అవార్డులు, బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డులు పొందారు. టాలీవుడ్లో నాగార్జున నటించిన కేడీ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన బాబా భాస్కర్ బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. ఇక బిగ్‌బాస్3 హౌస్‌లోకి ఎంట్రీ అయిన వారిలో పెద్ద వయస్సు ఉన్న బాబా భాస్కర్ అందరికి పెద్ద దిక్కుగా ఉన్నారు. బాబా తన ఆహార్యంతో, తన డ్యాన్స్‌తో, తన కలుపుగోలుతనంతో, మాటకారితనంతో అందరి కంటెస్టెంట్ల మనస్సును దోచుకున్నారు.
బిగ్‌బాస్ హౌస్ లో తన తోటీ పోటీదారులు బాబాయ్ అని పిలిపించుకునే దశకు చేరుకున్నారంటే అందరి ప్రేమను ఎలా పొందారో అర్థం అవుతుంది. బాబా భాస్కర్ శ్రీముఖీతో ఎక్కువగా క్లోజ్‌గా మూవ్ అయ్యేవారు. తనకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను తనదైన శైలీలో చేసి చూపించారు. ఇక మద్యలోనే ఎలిమినేట్ అవుతాడని అందరు అనుకున్నారు. కానీ ఎవ్వరికి అంతు చిక్కకుండా ఫైనల్ రౌండ్ వరకు రాగలిగారు. చివరి ముగ్గురు కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి ట్రోపీపై ఆశలు పెంచుకున్నారు. కానీ చివరి ఎలిమినేటర్‌గా బాబా బాస్కర్ నిష్క్రమించారు.