బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నాగార్జున ఎందుకు ప్లాప్ అయ్యాడంటే…!

-

స్టార్ మా టీవీలో 105రోజులు దిగ్విజ‌యంగా ముగిసింది బిగ్‌బాస్ 3 రియాల్టీ షో. ఈ షో కోట్లాది మంది తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది స్టార్ మా. అయితే ఈ బిగ్‌బాస్ 3కి  టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించారు. బిగ్‌బాస్ రియాల్టీ షోలో 17మంది క‌ళ‌కారులు, జ‌ర్న‌లిస్టులు, యాంక‌ర్లు, సినిరంగానికి చెందిన వారు పాల్గొన్నారు.  జూలై 21న ప్రారంభమైన ఈ షోలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌, అలీ రెజా, శివజ్యోతి, వితిక, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, శిల్పా చక్రవర్తి, అషురెడ్డి, రోహిణి, తమన్నా సింహాద్రి, జాఫర్‌, హేమలు కంటెస్టెంట్లుగా హౌస్ ‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆది నుంచి అంతం వ‌ర‌కు బిగ్‌బాస్ షోలో పోటీదారులు త‌మ త‌మ ప‌రిధుల్లో అవ‌కాశం ఉన్నంత‌మేర‌కు రాణించార‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే చివ‌రికి గ్రాండ్ ఫినాలే ఆదివారం నిర్వ‌హించి విజేత‌ను ప్ర‌క‌టించారు. రాహుల్ సిప్లిగంజ్ విజేత‌గా నిలిచారు. దీంతో బిగ్‌బాస్‌కు ఎండ్ కార్డు ప‌డింది. అయితే బిగ్‌బాస్ 3కి వ్యాఖ్యాత వ్య‌వ‌హ‌రించిన అక్కినేని నాగార్జున ఎలా బిగ్‌బాస్‌ను న‌డిపించారు. అస‌లు ఈ షోను హిట్ ఇంత భారీ హిట్ అయిన‌ప్ప‌టికి, మ‌రి నాగార్జున హిట్ అయ్యారా..? ఫ‌ట్ అయ్యారా..? అనేది స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతున్న భావ‌న‌. అందుకే ఓసారి బిగ్‌బాస్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ప‌నితీరుపై ఓ విశ్లేష‌ణ చేసుకుందాం.

బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు ముందు రెండు సీజ‌న్లు విజ‌య‌వంతంగా ముగిసాయి. అయితే మొద‌టి సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, రెండో సీజ‌న్‌కు నేచుర‌ల్ స్టార్ నానీలు వ్య‌వ‌హరించారు. ఈ రెండు సీజ‌న్ల‌లో మొద‌టి సీజ‌న్‌లో వ్యాఖ్యాత‌గా ప‌నిచేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న క‌నుసైగ‌ల‌తోనే అంతా న‌డిపించారనే టాక్ ఉంది. ఇక ఎప్పుడు ఎక్క‌డ ఎలా రియాక్ట్ కావాలో, ఎక్క‌డ త‌గ్గాల్లో, ఎక్క‌డ కంటెస్టెన్స్‌ను తిక‌మ‌క పెట్టాలో, ఎక్క‌డ వారిని మంద‌లించాలో, ఏ మోస్త‌రులో మంద‌లించాలో అలా చేస్తూ ముందుకు సాగారు. ఆ సీజ‌న్‌కు పాపులారిటీని బాగానే తీసుకొచ్చారు.

అయితే రెండో సీజన్‌లో నేచుర‌ల్ స్టార్ నానీ కూడా జూనియ‌ర్ అంత స్థాయిలో కాకున్నా త‌న‌దైన ప‌ద్ధ‌తిలో బిగ్‌బాస్ షోను నిర్వ‌హించారు. ఇక పోతే ఈ మూడో సీజ‌న్‌లో నాగార్జున చేసిన ఫెర్ఫార్మెన్స్ చూస్తే ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌గా కాకుండా, 50 ఓవ‌ర్ల మ్యాచ్‌గా సాగించార‌ని మాత్రం టాక్‌. టాలీవుడ్‌లో తిరుగులేని హీరో నాగార్జున. 60 ఏండ్ల వ‌య‌స్సులో కూడా త‌న తండ్రి  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు   అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ యంగ్ హీరోల‌కు ధీటుగా రాణిస్తూన్నారు. అయితే బుల్లితెర‌పై జ‌రిగిన బిగ్‌బాస్ షోలో మాత్రం అనుకున్నంత‌గా త‌న స‌త్తాను చాట‌లేక‌పోయార‌నే మాత్రం చెప్ప‌వ‌చ్చు.

కంటెస్టెంట్ల న‌డుమ ఉన్నంత ర‌స‌వ‌త్త‌ర పోరును కూడా త‌న వ్యాఖ్యానంతో న‌డిపించ‌లేక పోయారు. గ‌తంలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునకు ఇప్ప‌డు బిగ్‌బాస్ 3 కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున‌కు చాలా తేడా ఉంద‌నేది స‌త్యం. ఈ బిగ్‌బాస్‌కు నాగార్జున కొంత విరామం తీసుకున్నారు. త‌న పుట్టిన రోజుకు కుటుంబ స‌భ్యుల‌తో విదేశాల‌కు వెళ్ళిన‌ప్పుడు నాగార్జున స్థానంలో టాలీవుడ్ మేటి న‌టి ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా ప‌నిచేశారు. ర‌మ్య‌కృష్ణ హోస్టింగ్‌తో బిగ్‌బాస్‌కు బూస్ట్ వ‌చ్చింది. అంత‌కు ముందు చ‌ప్ప‌గా సాగిన ఈ షో, ర‌మ్య‌కృష్ణ రాక‌తో ఊపొచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు.

ఇక నాగార్జున తిరిగి రాగానే కొంత‌లో కొంత బిగ్‌బాస్ ప‌రిస్థితి మెరుగుప‌డింది. ర‌మ్య‌కృష్ణ హోస్టింగ్‌ను నాగార్జున కొంత‌మేర‌కు కొన‌సాగించారు. దీంతో పాటుగా పోటీదారుల్లో ఒక్కొక్క‌రు ఎలిమినేట్ అవుతుండ‌టం, హౌస్‌లో పోటీదారులు త‌గ్గుతుండ‌టంతో బిగ్ బాస్ షోపై ఆస‌క్తి నెల‌కొంది. ముందుగా బిగ్‌బాస్‌పై ఉన్న అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో నాగ్ మాత్రం త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్ప‌వ‌చ్చు. చివ‌రి రోజు అంటే గ్రాండ్ ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వ‌చ్చారు. వ‌స్తూ వ‌స్తూనే బిగ్‌బాస్‌పై జోష్ నింపారు.

చిరు త‌న మాట‌ల చ‌తుర‌త‌తో, పంచ్ డైలాగ్‌ల‌తో, హ‌స్యంతో, క‌నుసైగ‌ల‌తో, ఒకింత ఆశ్చ‌ర్యంతో గ్రాండ్ ఫినాలేకు గ్రాండ్ గా మ‌లిచారు. మెగాస్టార్ చిరంజీవి హౌస్ కంటెస్టంట్ల‌తో ప‌రిచ‌యం సంద‌ర్భంగా చేసిన కామెంట్లు, చిరంజీవి వారితో మ‌మేక‌మైన తీరుతో నాగార్జున తేలిపోయాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఏదేమైనా నాగార్జున బిగ్‌బాస్ వ్యాఖ్యానం ఎలా ఉందంటే.. సినిమా హౌస్ పుల్‌.. బాక్సాఫీసు నిల్ అన్న చందంగా మారింది. మూడు సీజ‌న్ల‌ను చూసుకుంటే ద బెస్ట్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ నిలుస్తార‌ని చెప్ప‌డానికి ఎలాంటి సంకోచం లేద‌నే చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news