భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన అనేక మంది మహానీయుల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. మన్యం ప్రజల హక్కుల కోసమే కాదు.. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఈయన చురుగ్గా పాల్గొని కేవలం 27 ఏళ్ల వయస్సులోనే వీరమరణం పొందాడు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలకులను అల్లూరి గడగడలాడించాడు. చివరకు 1924 మే 7న బ్రిటిషర్లు ఆయనను కాల్చి చంపారు.
అల్లూరి సీతారామరాజు 1897వ సంవత్సరం జూలై 4న విశాఖపట్నానికి సమీపంలోని పాండ్రంగి అనే ప్రాంతంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు. అల్లూరి 9వ తరగతి వరకు మాత్రమే చదివాడు. అయినప్పటికీ ఆయన సంస్కృతం, జ్యోతిష్యం, విలువిద్య, గుర్రపు స్వారీలలో నైపుణ్యాన్ని సాధించాడు. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో ఆయన పెరిగారు. 1917లో మళ్లీ విశాఖపట్నంకు వచ్చి అక్కడి కృష్ణదేవి పేట గుండా మన్యంలోకి అడుగుపెట్టి అక్కడే జీవించాడు.
అప్పట్లో మన్యం ప్రజల దుర్భర జీవితాలను గురించి ఆయన తెలుసుకుని వారితోపాటే నివసించాడు. అలాగే మరోవైపు స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. బ్రిటిష్ పాలకుల దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. తన విప్లవ బాణాలతో బ్రిటిషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తన పదునైన మాటలతో ప్రజలను స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లేలా చేశాడు.
సీతారామరాజుకు గంటం దొర ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఆయన నడింపాలెం గ్రామవాసి. గంటందొరతోపాటు మిగిలిన మన్యం వీరులతో సీతారామరాజు బ్రిటిష్ పాలకులపై ఎప్పటికప్పుడు దాడులు చేసేవారు. ఈ క్రమంలో 1922వ సంవత్సరం ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి తన అనుచరులతో కలిసి తొలిసారి దాడి చేశాడు. తరువాత 23వ తేదీన కృష్ణదేవీ పేట పోలీస్ స్టేషన్, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేశారు. ఈ క్రమంలో వారు ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా ఆయుధాలను సేకరించారు.
తరువాత స్వాతంత్య్రోద్యమాన్ని మరింత చురుగ్గా కొనసాగించారు. బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేశారు. అయితే మన్యంలో విప్లవకారులను అణచివేయాలని బ్రిటిషర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారు మన్యం ప్రజలను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేసేవారు. అయితే తన ప్రజలను విడిచిపెట్టాలని, తాను లొంగిపోతానని చెప్పి అల్లూరి బ్రిటిషర్లకు లొంగిపోతాడు. దీంతో 1924 మే 7న విశాఖపట్నం సమీపంలోని మంప గ్రామం వద్ద అల్లూరి బ్రిటిషర్లకు లొంగిపోయాడు. తరువాత అల్లూరిని చింత చెట్టుకు కట్టి బ్రిటిష్ అధికారులు ఆయనను కాల్చి చంపేశారు.
అనంతరం మే 8న అల్లూరి అనుచరులు ఆయన పార్థివ దేహాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి అక్కడ తాండవనది వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయిన 23 ఏళ్ల తరువాత భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. అల్లూరి లాంటి మహానీయుడిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం అభినందనీయం.
Inddependence day Special Articles