ఎందరో స్వాతంత్ర సమరయోధులు.. విప్లకారుల త్యాగఫలమే భారతదేశానికి స్వాతంత్య్రం.. మనల్ని మనం పాలించుకునే ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి ఇప్పటికి 75 ఏళ్లు. పెద్దఎత్తున తిరుగుబాట్లు, యుద్ధాలు, ఉద్యమాల నడుమ 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత దేశానికి విముక్తి కలిగింది. బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయి వారిని దేశం నుంచి వెళ్లగొట్టడంలో ఎందరో కీలక భూమిక పోషించారు. బ్రిటిష్ పాలకులను దేశం విడిచి వెళ్లేలా వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన వారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. చనిపోయిన కూడా కొందరు మన మధ్యే ఉన్నట్టు ఉంటుంది. అలాంటి వారిని ఎన్నటికీ మరచిపోలేం. ఎందుకంటే వారు బతికి ఉన్నప్పుడు చేసిన సేవలు, పోరాటాలు, త్యాగాలు అందరి జీవితాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అలా తమ జీవితాన్నే ఫణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
మహాత్మా గాంధీ.. అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ .. సర్ధార్ వల్లభాయ్ పటేల్ అసలు పేరు వల్లభాయ్ ఝువేర్ భాయ్ పటేల్. గుజరాత్ రాష్ట్రంలోని నదియా పట్టణంలో 31 అక్టోబర్ 1875లో జన్మించారు. చిన్నతనం నుంచి అత్యంత ధైర్యవంతుడు. బార్డోలీ సత్యాగ్రహంలో అతని వీరోచిత కృషికి సర్దార్ బిరుదును పొందాడు. అతని ధైర్యం, తెగింపు కారణంగా అతను చివరికి భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుపొందాడు. సర్దార్ పటేల్ మొదట న్యాయవాది. కానీ అతను తన వృత్తి నుంచి వైదొలిగి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. అతను స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి డిప్యూటీ పీఎం అయ్యాడు. యూనియన్ ఇండియాలో రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. వల్లభాయ్ పటేల్ కు బిస్మార్క్ ఆఫ్ ఇండియా, బలమైన (ఉక్కు) మనిషి, సర్దార్, ఉక్కు మనిషి అని బిరుదులు ఉన్నాయి. వల్లభాయ్ పటేల్ 1950 డిసెంబర్ 15న కన్నుమూశారు. వల్లభాయ్ పటేల్ మరణించిన 41 సంవత్సరాల తర్వాత 1991లో మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
జవహర్‌లాల్ నెహ్రూ .. జవహర్ లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 సంవత్సరంలో ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో జన్మించారు. నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ. జవహర్‌లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ, స్వరూప్ రాణిల ఏకైక కుమారుడు. 1889లో జన్మించారు. నెహ్రూ వాస్తవానికి న్యాయవాది. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు. రాజకీయవేత్తగా ప్రసిద్ధి చెందారు. భారతదేశం యొక్క స్వాతంత్ర్యం పట్ల అతనికి మక్కువ, భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుండి విముక్తి చేయడానికి మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాల ప్రభావంతో అతను స్వాతంత్ర్య పోరాటంలో చేరాడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. చివరికి స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూకు పిల్లలంటే ఎక్కువ ఇష్టం. అందకే అతన్నిచాచా నెహ్రూ అని పిలుస్తారు. నెహ్రూ పుట్టినరోజును ప్రతియేటా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.
సుభాష్ చంద్రబోస్ .. నేతాజీ బిరుదుతో ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్ 1897లో జానకీనాథ్ బోస్, ప్రభాబతి బోస్ లకు ఒరిస్సాలో జన్మించారు. జలియన్‌వాలా బాగ్ ఊచకోత సుభాష్ చంద్రబోస్ ను తీవ్రంగా కలిచివేసింది. అంతేకాక 1921లో ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చేలా చేసింది. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగమయ్యాడు. గాంధీజీ ద్వారా ప్రచారం చేయబడిన అహింసా పద్దతి స్వేచ్ఛతో అతను సంతృప్తి చెందలేదు. అతను సహాయం కోసం జర్మనీకి వెళ్లి చివరికి ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA), ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
అల్లూరి సీతారామరాజు.. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలబడిన యువ విప్లవకారుడు, మన్నెం పాలిట దైవం అల్లూరి సీతారామరాజు. ఈయనను నేటికీ యువత ఒక రోల్ మోడల్ గా భావిస్తారు. అల్లూరి సీతారామరాజు అప్పటి కాలంలోనే బ్రిటీష్ పోలీసు స్టేషన్లపై బాంబు దాడి చేసిన మన్యం వీరుడు. అందుకే అక్కడి ప్రజలు, గిరిజనులు ఆయనను గొప్ప నాయకుడిగా భావిస్తారు. నేటికీ ప్రతి సంవత్సరం అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈయన పేరిట అనేక సినిమాలు కూడా వచ్చాయి. అవి కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అల్లూరి 1924లో బ్రిటీష్ వారిని గుండెల మీద కాల్చమని ధైర్యంగా అడిగిన వీరుడు. వారి తుపాకి తూటాలకు వీరమరణం పొందాడు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ మండలంతో పాటు చుట్టుపక్కల ఎవ్వరినడిగినా నరసింహారెడ్డి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన చరిత్ర అంత ఘనమైనది. 1846 సంవత్సరంలో బ్రిటీష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడాడు. తల్లి లాంటి నా దేశాన్ని వదిలి వెళ్లమని ఆంగ్లేయులను హెచ్చరించాడు. ఈయన పేరిట కూడా ఇటీవలే ఓ సినిమా కూడా వచ్చింది. అందులో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు. ఈ సినిమా వల్ల కూడా చాలా మందికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసింది. అయితే చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.