జన్మాష్టమి రోజు ఇంటి ముందు కన్నయ్య అడుగులు ఎందుకు వేస్తారు..?

-

బృందావనమాలి రా..రా.. మా ఇంటికి ఒకసారి అంటూ జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణుడి తమ ఇంట్లో నడయాడాలని బుజ్జి కిట్టయ్య అడుగులు వేస్తుంటారు. ఇంట్లో చిన్న పిల్లలను రాధాకృష్ణులుగా తయారు చేసి వారిలోనే ఆ పరమాత్మున్ని చూసుకుని ఆనందపడతారు. పసివాళ్ల అడుగులను ఇంట్లో నుంచి బయటకు కాకుండా.. బయటి నుంచి ఇంట్లోకి వేస్తుంటారు. దానర్థం కన్నయ్యను తమ ఇంటికి రమ్మని ఆహ్వానించడం. జన్మాష్టమి రోజున కిట్టయ్యను అందంగా ముస్తాబు చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు అలంకార ప్రియుడు కదా. కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే శ్రీకృష్ణాష్టమి రోజున కిట్టయ్య అడుగులు ఎందుకు వేస్తారు.. దాని వెనక కారణమేంటో తెలుసా..?

 

సమస్త కోటి విష్ణు పాదాల చెంతే ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఉన్న ప్రతి భగవత్ రూపం విష్ణు అవతారమే. రాముడిలా మారి రావణ సంహారం చేసినా.. కృష్ణుడి అవతారమెత్తి నరకాసురుడిని వధించినా.. అవన్నీ విష్ణు అవతారాలే. ఆ విష్ణువు అవతారాల్లో ఒకటైన కృష్ణభగవానుడి పుట్టికే విచిత్రం. ఆ తర్వాత ఆ భగవంతుడి జీవితమంతా కష్టాలే. పుట్టుకతో మొదలైన ఆ కష్టాలను అవతారం అంతమయ్యే వరకు ముఖంపై చిరునవ్వు నెరవకుండా అనుభవించాడు. కష్టమైనా.. సుఖమైనా.. ఏదీ శాశ్వతం కాదని తన అవతారం ద్వారా ఈ విశ్వానికి చాటాడు. కృష్ణుడు కటిక చీకటైన కృష్ణ పక్షంలో జన్మించాడు. అది కూడా చెరసాలలో. చీకటిలో పుట్టినా.. ఆ కన్నయ్య అందరి జీవితాల్లో అంధకారాన్ని తొలగించి ప్రకాశవంతం చేశాడు. అందుకే మన జీవితాల్లో ఆ కన్నయ్య అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించాలని కోరుతూ బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ తమ ఇంట్లోకి.. తమ జీవితాల్లోకి రావాలని కన్నయ్యను ఆహ్వానిస్తాం.

శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో పరిపూర్ణంగా జీవించాడు. ఏ అవతారంలోనూ తనకు తాను దేవుడిగా ప్రకటించుకోని విష్ణుమూర్తి.. కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు మాత్రం తానే సర్వకోటి జగత్తకు మూలధారిని అని.. భగవంతుడిని అని చెప్పుకున్నాడు. ఆ దేవుడు తన భక్తులను ఎలాగైతా అనుక్షణం కంటపెట్టుకుని కాపాడుతూ ధర్మమార్గాన నడిపిస్తాడో కృష్ణభగవానుడు కూడా తనని నమ్ముకున్న వారిని ధర్మమార్గంలో నిలిపాడు. వారిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాడు.

బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం…ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లోనూ గురుతత్వాన్ని చూపించిన అవతారం కృష్ణరూపం ఒక్కటే. అందుకే కృష్ణుడికి ఇంట్లోకి ఆహ్వానం పలకడం ద్వారా సకలదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఓ గురువుగా, స్నేహితుడిగా తమ ఇంట్లోకి వచ్చి తమ కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ కృష్ణుడి అడుగులు వేస్తారు. ఎందుకంటే కురక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి వెన్నంటే ఉండి దోషాల నుంచి విముక్తి కల్పించి విజయాన్ని అందించినట్టే..తాము తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడమని కన్నయ్యను వేడుకుంటారు.

కురుక్షేత్రమంతా కృష్ణుడు తన వారి వెంటే ఉన్నాడు కానీ ఏనాడు తాను కదనరంగంలో అడుగుపెట్టలేదు. కేవలం తాను తన వాళ్లను ధర్మమార్గంలో నడవాలని నిర్దేశిస్తూ మాత్రమే వచ్చాడు. అలా ధర్మమార్గంలో వెళ్తున్న వారికి వచ్చిన అడ్డంకులను తన మాయతో దూరం చేస్తాడు. అలాగే తమను కూడా ధర్మమార్గాన నడిచేలా మార్గనిర్దేశం చేయాలని కోరుతూ.. వేలు పట్టి నడిపిస్తూ సరైన నడవడికను నేర్పించమని కోరుతూ కృష్ణపాదుకలు వేస్తారు. తమ బతకడమెలాగో నేర్పమని వేడుకుంటూ బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ తమ ఇంట్లోకి.. తమ జీవితాల్లోకి రావాలని కన్నయ్యకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతారు.

Read more RELATED
Recommended to you

Latest news