తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12,769 గ్రామాల్లో జరగనున్న పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వివిధ పథకాల కింద సాధించిన ప్రగతిని పెద్ద ఎత్తున నివేదించాలని, పలు కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఉత్సవాల నిర్వహణకు నిధులను విడుదల చేసింది.
గ్రామాల్లో ఇంటింటా ముగ్గులు వేయాలని, ఇళ్లకు మామిడి తోరణాలు కట్టాలని ఆదేశించింది. పంచాయతీ, క్రీడాప్రాంగణం, నర్సరీ, వాటర్ ట్యాంక్, ట్రాక్టర్లను అలంకరించాలని సూచించింది. ఉదయమే జాతీయ జెండాను ఎగర వేయాలని, అమరవీరులకు నివాళులర్పించాలని పేర్కొంది. అనంతరం గ్రామ సభను నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల దుస్థితి, తెలంగాణ ఆవిర్భావం అనంతరం భారాస ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేయాలని సూచించింది. రంగవల్లులు, పరిశుభ్రత, అలంకరణలకు సంబంధించి మూడు ఇళ్ల యజమానులకు పురస్కారాలు ఇవ్వాలని పేర్కొంది.