రాక్షస ముఖ్యమంత్రి పాలనలో దేశంలో చట్టాలు చేసే ఎంపికే ప్రాథమిక హక్కులు లేకుండా పోయాయని, ఒక ఎంపీకే ప్రాథమిక హక్కులు లేవంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని, న్యాయస్థానాలు కూడా తనకు సరైన సమయంలో న్యాయం చేయలేకపోయాయని, సుప్రీంకోర్టు జోక్యంతో బ్రతికి బయటపడ్డానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు.
తాజాగా నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తనకు వచ్చిన కష్టం ఇతరులెవరికీ రాకూడదని, 2021 మే 14వ తేదీన సీఐడీ పోలీసులు తనపై అక్రమ కేసు బనాయించి తనను హైదరాబాదులో అరెస్టు చేశారని, అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఆ కార్యాలయ ఆవరణలో సీసీ కెమెరాలను తొలగించి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని, ఆ మరుసటి రోజు మెజిస్ట్రేట్ అరుణ గారి మందు తనను హాజరు పరిచారని తెలిపారు.
నిలబడలేని తన దీనస్థితిని మెజిస్ట్రేట్ గారికి వివరించగా, కూర్చోవడానికి కుర్చీ ఏర్పాటు చేయమని ఆమె ఆదేశించారని తెలిపారు. కుర్చీలో కూర్చుని సీఐడీ పోలీసులు లాకప్ లో ఎలా చిత్రహింసలకు గురిచేశారో వివరించానని, పోలీసుల దెబ్బలకు కందిపోయిన తన అరికాళ్లను మెజిస్ట్రేట్ గారికి చూపించానని, తన కాళ్ళను పరిశీలించిన మెజిస్ట్రేట్ గారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, డాక్టర్ రమేష్ ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించి తక్షణమే నివేదికను అందజేయాలని సీఐడీ పోలీసులను ఆదేశించారని, అప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారని బీపీని పరిశీలించారని, కాళ్లకు ఎక్స్ రే తీసి సెలైన్లు ఎక్కించారని, సెలైన్లలో ఏమైనా కలుపుతారేమోనని భయపడ్డానని, తనకు చేసిన వైద్యం ఏమిటో చెప్పలేదని అన్నారు. రమేష్ ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మెజిస్ట్రేట్ గారు ఆదేశించినప్పటికీ, సీఐడీ పోలీసులు పట్టించుకోలేదని, తక్షణమే వైద్య నివేదికలను అందించాలని ఆదేశించినప్పటికీ, మెజిస్ట్రేట్ గారి ఆదేశాలను తూ నా బొడ్డు అన్నట్లుగా గాలికొదిలేశారని అన్నారు. రమేష్ ఆసుపత్రికి తీసుకు వెళుతున్నట్లుగానే చెప్పి దిలీప్ కుమార్ అనే పోలీస్ అధికారి జైలులో తోసి వేశారని, తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను కలవడానికి తన లాయర్ ను కూడా అనుమతించలేదని, ఎవర్నీ అసలు దగ్గరకు రానివ్వలేదని, తన సెక్యూరిటీని కూడా దూరం పెట్టారని, జైల్లోనే తనను చంపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారని, అయినా వెంకటేశ్వర స్వామి వారి దయవల్ల బ్రతికి బయటపడ్డానని చెప్పారు.