మధ్యతరగతి వారికోసం అందుబాటులోకి నూతన గృహ నిర్మాణ విధానం : నిర్మలా సీతారామన్

-

మధ్యతరగతి వారి కోసం నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మురికివాడలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇళ్లు కట్టుకోవడానికి, కొనుగోలుకు ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తామని చెప్పారు. జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.

 

రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని వివరించారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్రధనస్సు కార్యక్రమం తీసుకొస్తామన్న నిర్మలా సీతారామన్.. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు ఇస్తామన్నారు.

“ఈ పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు మూడు రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షలలోపు ఆదాయం వరకు పన్ను రహితంగా ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధతతో పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించాం. ఫేస్‌లెస్‌ విధానంతో పన్ను అసెస్‌మెంట్‌లో పారదర్శకత, సత్వర రిటర్న్‌ల చెల్లింపులు జరుగుతున్నాయి. సరాసరి నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.66 కోట్లకు చేరింది. జీఎస్టీ ముందున్న విధానం కన్నా ఈ ఆదాయం రెట్టింపయింది.” అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news