ఒక్కోసారి..నే..ఒంటరి..దిగులు – భయం – బాధ అన్నవి లేని చోట ఒంటరి..అయినా! ప్రేమా కోరిక అన్నవి జంట పక్షుల్లా ఎగిరి..నా చుట్టూ చక్కర్లు కొడ్తాయి..కోరిక పెరిగితే ఏం కావాలి నేను..దేహాల్లో ఐక్యం కావాలి..చుట్టూ ఉన్నవి..నీ అంత మంచి మనసులు..కానప్పుడు ఐక్యం అన్నది ఓ మాలిన్యం..స్వేద వేదాల వల్లింపు ప్రియమయిన నీతోనే కావాలి..(లేదా) నీ నుంచి..
నీ దేహంపై వాలిన కోరిక నుంచి కావాలి..వాంఛాతీతం అన్న పదానికి ఈ జీవితాన చోటే లేదు..
మళ్లీ ఇలా ఒంటరిని ! రాస్తున్నానొక మార్నింగ్ రాగా…
అంతర్భాగం..అనంతర భాగం..ఏది భాగం – ఎవరిది భాగ్యం అన్నవి తెలియదు.! కనీస స్పృహ లేనివి కొన్ని .. చంధస్సుల రూపాన ..కౌగిలింతలు ఏవో కొన్ని పరిచయం అయి ఉన్నాయి. కోరికలన్నీ దేహాలపై వాలిన లిపి సంకేతాలు కావొచ్చు. ఇక్కడ నేను ఎలా ఉన్నానంటే..ఒక్కోసారి నేను ఒంటరి.. దిగులు – భయం – బాధ అన్నవి..లేని చోట ఒంటరిని అయినా..ప్రేమా, కోరిక జంట పక్షుల్లా ఎగిరి..నా చుట్టూ చక్కర్లు కొడ్తాయి..కోరిక పెరిగితే ఏం కాను ? దేహాల్లో ఐక్యం కావాలి. చుట్టూ ఉన్నవి నీ అంత మంచి మనసులు..కానప్పుడు ఐక్యం అన్నది ఓ మాలిన్యం.. స్వేద వేదాల వల్లింపు ప్రియమయిన నీతోనే కావాలి లేదా నీ నుంచి నీ దేహంపై వాలిన కోరిక నుంచి కావాలి..వాంఛాతీతం అన్న పదానికి ఈ జీవితాన చోటే లేదు..మళ్లీ ఒంటరిని..!
దేహాలకు కొన్ని కోరికలను కానుకలుగా ఇవ్వడం కాలం మాత్రమే చేస్తున్న పని..ఈ క్షణం ఉన్న ఆనందాల్లో..ఈ క్షణం లేనివి ఏమయినా ఉంటే అవి వెలికి గురి కావాలి. అయినా ! మనుషులంతా తదేకంగా ఒకరినే ఎందుకని ప్రేమ పేరిట వేధిస్తారో లేదా ఆరాధిస్తారో..కావాలంటే ఈ కాలపు కొలమానాలు నాలో రెట్టించిన వేగాలకు అందనివి అని చెప్పగలను..
కానీ..నీ దేహంపై వాలిన ప్రతి చోటా ఈ నీడలకూ, ఈ స్పర్శలకూ, అంతర్వాహినీ రూపాలు ఏవయినా ఉంటే అవి కవిత్వీకరణకు అందవు. వ్యక్తంలో లేనివి, అనుభవంలో లేనివి, ఊహలో లేనివి ఇంకేవయినా ఉంటే అవి ఈ రేయి నుంచి ఆ రేయి వరకూ ప్రయాణించి కడపటి వార్తలా ఒక చిమ్మ చీకటి చీము నెత్తురు చెంత నాట్యమాడిపోతుంటే..అప్పుడు నే ఆవహించిన నీ రూపం, నిన్ను దేహంలో దాచుకున్నాక ఈ సంద్రం..సంబంధిత ఆవరణ గాలులూ అన్నీ మేలే చేస్తాయి అనుకోవడం ఓ విభ్రమ.
జీవ కాంతుల వేడుకలకు ఆహ్వానాలు పొందాను..అయినా శరీరం ఒక్కోసారి ప్రేమతుల్యతను పొందాలని పొందిన ఆరాటం ఒకటి ఎక్కడో ఓ చోట ఓడిపోక తప్పదు..అయినా ఈ మనుషులూ,ఈ స్త్రీలూ కొన్ని కాలాలుగా కాలాలను మోసం చేస్తున్నారు.. ఆప్తత, స్వచ్ఛత అన్నవి పెనవేసుకునే తీరు ఒకటి జీవితాల్లో లేకుండా పోతోంది. ఇప్పుడు తన పాదాల ముద్దులాటలో ఏమయినా కవితానుగమనాలు చిత్రీకరించని తీరున ఉన్నాయని అనుకోవడం..అనుభవం పొందడం..ఒక్కటిగానే తోచడం లేదు. నేను రేయి పొద్దుల్లో ఎలా ఉండాలో కూడా ఒక నిర్దేశికతకు అందకుండానే ఉంది. అసలీ బుద్ధి,తెలివి,జ్ఞానం అన్నవి స్త్రీ దేహం దగ్గర ఓడిపోతాయి ..లేదా ఓడిపోయిన విధంగా ఒక ఆదేశం జారీ చేస్తాయి. కాలం అనుజ్ఞ కన్నా స్త్రీ అనుజ్ఞ కాస్త చిత్ర,విచిత్రంగా తోస్తుంది.. కొన్ని రేఖల దగ్గర – కొన్ని సందిగ్ధతలు.. అవధి నిర్ణీతం కాకమునుపే తెల్లారిపోతోంది.. శృంగారానికి అవధి ఏంటన్నది ఒకరి ప్రశ్న..జీవితానికి ఎలా లేదో ఇక్కడ కూడా అదే రీతిన లేదు అన్నది జవాబు.
రెండు గోళాలు ఢీ కొంటాయి
రెండు యవ్వనాలు ఢీకొంటాయి
అభిఘాతాలు విఘాతాలు అన్నీ అన్నీ
తనలో లయం అయిపోతాయి
కాలం,శృంగారం..గాయాలు చేస్తూనే ఉంటాయి..కనుక గాయాలు చేసేవి జ్ఞాపకాలు అయ్యాయి..ప్రేమ జ్ఞాపకం కాదు జ్ఞానం అంతకన్నా కాదు.. పోనీ ! ప్రేమ సైన్సా..అంతకన్నా కాదు..మరి! దేహాల కూడిక దగ్గర స్వేద వేదాల వల్లింపు అన్నవి ఏంటంటే అవే శాస్త్రం,వివేకం, విజ్ఞత అని అంటాన్నేను..మరో మారు నీ దేహంలో కరిగి కన్నీరయిన క్షణాలే ఈ రేయిని వికసింపజేస్తాయన్నది నా భావన.
కొన్ని సార్లే రంగులు బాగుంటాయి..దేహాలలో కరిగిన కలలూ,రంగులూ రెండూ వేర్వేరుగా ఉంటాయి..నీపై పొందిన హక్కునో , బాధ్యతనో విధి నిర్వర్తించడం అన్నది ఇక చేయదగని పని..ఒక్కసారి కూడా అంతరార్థ సహిత మౌనాలు ఏవీ నా ఇంట ఉండడం లేదు..నీ చెంతకు చేరాక రేయి దుఃఖంలో కరిగాక అవి శృంగార సంబంధ వాంఛల్లో కరిగాక మాత్రమే..కొద్దిగా అర్థ సంబంధం ఏంటన్నది చెప్పివెళ్తున్నాయి . జీవితానికి అర్థ సంబంధం వెతకడం తప్పు..దరిద్రగొట్టు కవులు ఈ తరహా పనులే చేస్తారు.. మరణానికి ముందు కూడా ఇలాంటివే చూస్తారు మరియు చేస్తారు.. కూడా ! ఇంతటి అంధకారంలో నేను లేను.. ఉండబోను కూడా ! మిక్కిలి పరివర్తనల్లో రాత్రి తన దేహం నుంచి పొందిన దుఃఖ సంబంధానిదే!
ఆర్ట్ : ధను అండ్లూరి, శ్రీకాకుళం జిల్లా
జయమ్మ పంచాయతీ ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్