బాబు బర్త్ డే రేపిన సందేహాలివి!

-

ఆయన సుమారు 40ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.. ఒక పార్టీ అధ్యక్షుడు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి… ప్రస్తుతం కూడా ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న నాయకుడు… అలాంటి నాయకుడి జన్మదినం అంటే… ఇంక ఆ పార్టీ నాయకులు, క్యాడర్ ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారో ఊహించుకోవచ్చు! 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావమో లేక.. కరోనా ఎఫెక్ట్ పుణ్యమో.. అదీకాక ఈ సమయంలో బయటకు వెళ్లడం ఎందుకొచ్చిన రిస్క్ అనుకున్నారో ఏమో కానీ… చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ విషయంలో టీడీపీ నేతలు లైట్ తీసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ సమయం కాబట్టి… సంబరాలు అంబరాన్ని అంటలేదు కానీ… లేకపోతేనా దుమ్ము దులిపే వాళ్లం అని టీడీపీ నేతలు చెప్పుకున్నా… అందులో అసలు విషయం అదేనా అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు కొందరు నెటిజన్లు! ఇది కరోనా సమయం.. ఎవరూ అవసరం ఉంటే తప్ప ఇళ్లనుంచి బయటకు రాకూడని పరిస్థితి.. ఈ సమయంలో సంబరాలు చేసుకోకపోయినా… కనీసం ఆయన పేరుచెప్పి పండో, ఫలమో అయినా పంచకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది!! అక్కడా ఇక్కడా ఒకరు ఇద్దరు నేతలు (నేతలు మాత్రమే) రక్తదానం చేయడం.. పది పసుపు కవర్లలో కాయగూరలు పంచడం! మినహా ఎక్కడా హడావిడి కనిపించలేదు! ఇది హడావిడి చేసే సమయం కాకపోయినా… కనీసం బర్త్ డే పేరు చెప్పి అయినా ప్రజలకు కాస్త ఉపయోగపడే పనులు చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వచ్చి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో… పలువురు నేతలు, దాతలు… నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, కాయగూరలు, మాస్కులు అంటూ తమకు తోచిన దానిలో ఎంతోకొంత ప్రజలకు పంచుతూ తోడుగా నిలుస్తున్నారు. ఇది ఏపీ ప్రభుత్వ సమస్య తప్ప తమ సమస్య కాదని భావించారో ఏమో కానీ… ఈ విషయంలో టీడీపీ నేతలు పూర్తిగా వెనకబడ్డారు! విమర్శల మీద పెట్టే శ్రద్ద… సాయం మీద పెట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సరే… సందర్భం కోసం చూస్తున్నారేమో అనుకుని ఇంతకాలం ఎదురు చూసినవారు… చంద్రబాబు బర్త్ డే రోజుకి మించిన సందర్భం టీడీపీ నేతలకు ఏమి ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు!

ఈ విషయాలపై రెండు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు! వాటిలో ఒకటి… తాను ఏపీకి వచ్చిన తర్వాతే తప్ప ఈ లోపు ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, పబ్లిసిటీ విషయంలో పోటీపడొద్దు అని బాబు, ఆ పార్టీ నాయకులను హెచ్చరించారా? అని … రెండోది… 2019సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, అనంతరం జరిగిన శాసనసభా సమావేశాల్లో పార్టీ పరిస్థితిని గమనించి.. చంద్రబాబుని ఆ పార్టీ నాయకులు లైట్ తీసుకున్నారా? అని! ఈ రెండు ప్రశ్నలకూ కాలమే సమాధానం చెప్పాలి మరి!!

Read more RELATED
Recommended to you

Latest news