దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి పలు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తుండగా, కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా కేసుల్లో పెరుగుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలానే ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమల్లోకి రానుంది. మే 5 నుంచి రెండు వారాల పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా ఏపీలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసుల కట్టడిలో ఊహించిన మార్పు లేకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనా నియంత్రణపై సీఎం జగన్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని చెప్పారు. కరోనా కట్టడి చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని సీఎం అధికారులకు ఆదేశించినట్లు ఆళ్లనాని వివరించారు.