మన దేశంలో తొలి కరోనా మరణం నమోదు అయింది. కర్నాటకకు చెందిన 76 ఏళ్ళ వృద్దుడు కరోనా కారణంగా మరణించాడు. కలబుర్గికి చెందిన మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ అనే 76 ఏళ్ళ వృద్దుడు సౌదీ అరేబియాలో పర్యటించి ఇటీవల తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతనికి అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల 5న కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయినా అక్కడ తగ్గలేదు.
అనంతర౦ హైదరాబాద్ కి మార్చ్ 9 న తీసుకొచ్చి చికిత్స చేసారు. అప్పటికి వైరస్ లక్షణాలు తగ్గలేదు. అతన్ని తిరిగి స్వస్థలానికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఈ నెల 11 మరణించాడు. మహహ్మద్ హుస్సేన్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో రక్తం, లాలాజల నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు అధికారులు. ఆ పరీక్షల్లో అతడు కోవిడ్-19 వైరస్‌తోనే చనిపోయాడు అని గుర్తించారు.
హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలోనే అతడు చికిత్స పొందినందున.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని కర్నాటక అధికారులు మీడియాకు తెలిపారు. దీనితో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్ర ఇప్పటికే దీనిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.