కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి హాంకాంగ్ పరిశోధకులు తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం తెలియజేశారు. ఆ వైరస్ ఇప్పటి వరకు ముక్కు, నోరు ద్వారా వ్యాప్తి చెందుతుందని చెబుతూ వచ్చారు. అందుకనే మనం ఆ వైరస్ రాకుండా మనం మాస్కులను కూడా ధరిస్తున్నాం. అయితే కరోనా వైరస్ కేవలం ఆ భాగాల ద్వారానే కాక.. కళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు తేల్చారు. కళ్లపై ఉండే కంజంక్టివా అనే సూక్ష్మమైన కణజాలం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వారు గుర్తించారు.
కాగా గతంలో సోకిన సార్స్ కన్నా ప్రస్తుతం కరోనా వైరస్ 100 రెట్లు ఎక్కువ వేగంగా మనపై అటాక్ చేస్తుందని సదరు హాంకాంగ్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు హాంకాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనా బృందం వివరాలను వెల్లడించింది. వీటిని లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లోనూ ప్రచురించారు. ప్రస్తుతం ముక్కు, నోటి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారని, కానీ కళ్ల ద్వారానే ఆ వైరస్ ఎక్కువగా మనలోకి ప్రవేశిస్తుందని వారు చెప్పారు.
కరోనా వైరస్ కళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని తేలిందని కనుక ప్రజలు కళ్లను కూడా కవర్ చేసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. కళ్లకు పెద్ద సైజ్ కలిగిన అద్దాలను ధరించడం ద్వారా కళ్లను కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చని అంటున్నారు. ఇక కళ్లను వీలైనంత వరకు చేతుల్తో టచ్ చేయకూడదని, శానిటైజ్ చేసుకున్నాకే ఆ పని చేయాలని వారంటున్నారు.