వైసీపీలో క్వారంటైన్ చిచ్చు.. మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే

-

ఏపీలో క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ముందుగా ఏపీ కంటే తెలంగాణ‌లో ప‌రిస్థితులు తీవ్ర‌మ‌య్యాయి. అయితే క్ర‌మ‌క్ర‌మంగా ఢిల్లీలోని మ‌ర్క‌జ్ సంఘ‌ట‌న బ‌య‌ట ప‌డ‌డంతో ఇక్క‌డ కూడా క‌రోనా కేసులు ఎక్కువ అయ్యాయి. ఇప్ప‌టికే గుంటూరు, క‌ర్నూలు లాంటి జిల్లాల్లో క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనాకు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు. ఇదిలా ఉంటే తాజాగా క‌రోనా క్వారంటైన్ విష‌యం ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకే చెందిన ఓ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే మధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేపింద‌ని తెలుస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల కంటే గుంటూరు జిల్లాలో క‌రోనా కేసులు ఎక్కువుగా ఉన్నాయి.

ఈ జిల్లాలో ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసులు 100కు పైగా దాటేశాయి. ఈ క్ర‌మంలోనే గుంటూరులో ప్ర‌త్యేక క్వారంటైన్ శిబిరం కూడా ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ కేసుల డిశ్చార్జ్ వ్యవహారంలో మంత్రి మోపిదేవి.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మధ్య వివాదం నెలకొంద‌ట‌. ఎమ్మెల్యే బంధువులు ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి రావ‌డంతో వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచారు. ఈ క్ర‌మంలోనే 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపాలని ముస్త‌ఫా సూచించారు.

అయితే మంత్రి మోపిదేవి మాత్రం జీవో ప్ర‌కారం వీరిని బ‌య‌ట‌కు పంప‌డం కుద‌ర‌దు అని చెప్పార‌ట‌. ఈ క్వారంటైన్ పూర్తి చేసుకున్న‌వారిలో ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు ఉండ‌డంతో వారిని బ‌య‌ట‌కు పంపాల‌ని ఎమ్మెల్యే ముస్త‌ఫా ఎంత ఒత్తిడి చేసినా మంత్రి మోపిదేవి ఒప్పుకోక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంద‌ని టాక్‌. అలాగే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎమ్మెల్యే రెడ్‌జోన్ ప్రాంతాల్లో కూడా ప‌ర్య‌టించార‌ని.. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని కూడా మోపిదేవి అన‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య వార్ ముదిరే వ‌ర‌కు వెళ్లింద‌ని స‌మాచారం.

బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తులు కూడా అర్థం ప‌ర్థం లేకుండా మాట్లాడుతున్నార‌ని మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఎమ్మెల్యేని ఉద్దేశించి చేసిన‌వే అంటున్నారు. మంత్రి మాత్రం మొత్తంగా 28 రోజులు క్వారంటైన్లోనే ఉండాల‌ని అంటున్నారు. అటు ఎమ్మెల్యే మాత్రం త‌మ కుటుంబ స‌భ్యుల‌ను వ‌ద‌లిపెట్టాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రి వార్ ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news