కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం జనతా కర్ఫ్యూను పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో మనకు రెండు మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అవే.. ఐసొలేషన్, క్వారంటైన్.. ఇవి రెండూ ఒకటేనని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అవి రెండూ వేర్వేరు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా లక్షణాలు ఏమీ లేకున్నా.. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు లేదా ఆ వైరస్ ఉన్నవారితో కలసి ఉన్న వారిని క్వారంటైన్‌లో ఉంచుతారు. అంటే వారికి వ్యాధి ఉండాల్సి పనిలేదు. కానీ వారికి ఉందేమోనని అనుమానంతో.. లేదా.. కొద్ది రోజులు ఉంటే కరోనా బయటపడవచ్చన్న సందేహంతో వారిని ఎక్కడకూ వెళ్లకుండా నిర్బంధించి ఒకే ప్రదేశంలో ఉంచుతారు. వారిని ఇతరులతో కలవనివ్వరు. దీన్నే క్వారంటైన్ అంటారు. ఇలా చేయడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఆ చెయిన్ బ్రేక్ అవుతుంది. అందుకే కరోనా అనుమానితులను క్వారంటైన్‌లో ఉండమని చెబుతున్నారు. కానీ కొందరు వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందుతోంది.
ఇక ఐసొలేషన్ అంటే.. కరోనా వైరస్ ఉండి.. ఆ వ్యాధితో బాధపడుతున్నవారిని ఎవరితో కలవనీయకుండా ఒంటరిగా ఉంచుతారు. వారిని హాస్పిటల్‌లో ఒంటరిగా ఉంచి చికిత్స అందిస్తారు. అలాంటి వార్డులను ఐసొలేషన్ వార్డులని అంటారు. వీరితో ఇతరులను ఎట్టి పరిస్థితిలోనూ కలవనివ్వరు. ఇక క్వారంటైన్ లేదా ఐసొలేషన్ ఏదైనా సరే.. అనుమానితులు, రోగులను 14 రోజుల పాటు ఒకే చోట నిర్బంధంలో ఉంచుతారు. ఈ క్రమంలో వారి నుంచి కరోనా ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కరోనా అనుమానితులు అయితే వారిలో ఆ రోజులలోపు వ్యాధి బయట పడవచ్చు లేదా వారికి వైరస్ వ్యాప్తి చెందకపోవచ్చు. కానీ క్వారంటైన్‌లో ఉంచడం వల్ల వైరస్ అంతమవుతుంది. దీంతో వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అందుకనే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు.
ఇక ఐసొలేషన్‌లో 14 రోజుల పాటు ఉంచి రోగులకు చికిత్స అందిస్తే వారికి వ్యాధి నయమవుతుంది. తరువాత ఇంటికి డిశ్చార్జి చేస్తారు. అయినప్పటికీ వారు మరో 7 నుంచి 10 రోజుల పాటు ఇతరులతో కలవకూడదు. వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఇలా కరోనా రోగులు రికవరీ అవుతారు. దీంతో వారి నుంచి ఇతరులకు ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు సూచించిన విధంగా నడుచుకుంటే కరోనా వైరస్‌ను శాశ్వతంగా అడ్డుకోవచ్చు. కానీ కొందరు మూర్ఖంగా వ్యవహరిస్తుండడంతోనే అసలు తలనొప్పంతా వస్తోంది. కనుక ఎవరైనా సరే.. అనవసరంగా భేషజాలకు పోయి పిచ్చిగా ప్రవర్తించకండి. కరోనాను అడ్డుకోవాలంటే కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. లేదంటే తరువాత ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా అందరం అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..!