కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించగా.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పలు కార్యకలాపాలు యథావిధిగా జరిగేందుకు గాను ఆంక్షలను సడలించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే దేశంలోని జిల్లాలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించారు. ఈ క్రమంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రేపటి నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలించి పలు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇక కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలించకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను సడలించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో ఆంక్షలను సడలించే రాష్ట్రాల్లో రేపటి నుంచి కొనసాగనున్న పలు కార్యకలాపాలు, అందుబాటులో ఉండనున్న పలు సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి.
* బ్యాంకులు (ఆర్బీఐ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి), ఏటీఎంలు, ఆర్థిక సంస్థలు పనిచేస్తాయి.
* సోషల్ సెక్టార్ (అనాథలు, వృద్ధాశ్రమాలకు సంబంధించి సంస్థలు, వాటి కార్యకలాపాలు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి సేవలు కొనసాగుతాయి. అంగన్వాడీలు, సంక్షేమ పథకాలను అమలు చేసే వాలంటీర్లు పనిచేస్తారు. మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ కొనసాగుతుంది.
* ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి. సామాజిక దూరం పాటిస్తూ.. జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారులు పనులు జరిగేలా చూడాలి.
* తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ సేవలు కొనసాగుతాయి.
* సరుకు రవాణా, కార్గో లోడింగ్, అన్లోడింగ్, రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా, అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర సరుకు రవాణా సేవలు కొనసాగుతాయి.
* ఆన్లైన్ టీచింగ్, డిస్టాన్స్ లెర్నింగ్ సేవలు కొనసాగుతాయి.
* ఈ-కామర్స్ సంస్థలు నిత్యావసరాలను ఆన్లైన్ ద్వారా డెలివరీ చేయవచ్చు.
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా డీటీహెచ్, కేబుల్ సేవలు, డేటా, కాల్ సెంటర్ (ప్రభుత్వానికి అనుబంధమైనవి) సేవలు కొనసాగుతాయి. కొరియర్ సేవలు, వైద్య, ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయి. ఇళ్లకు వెళ్లలేక ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి హోటళ్లు, లాడ్జిలు సేవలు అందించవచ్చు.
* గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పరిశ్రమలు, ఇతర వ్యాపారాలు కొనసాగుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, మెడికల్ పరికరాల తయారీ పరిశ్రమలు కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
* రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నిర్మాణ పనుల నిర్వహణకు అనుమతి ఉంటుంది.
* అత్యవసర సేవలకు ప్రైవేటు వాహనాలను వాడుకోవచ్చు. సామాజిక దూరం నిబంధనల మేరకు ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో తమ కార్యాలయాలకు వెళ్లవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలు పనిచేస్తాయి.