మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 20 (సోమవారం) నుంచి ఆ రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను సడలించనున్నట్లు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ఆయా ప్రాంతాల్లో పలు కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తారు. అయితే దేశంలో కరోనా కేసుల పరంగా మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇక మహారాష్ట్రలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను సడలించినప్పటికీ ఆయా జిల్లాల సరిహద్దులను మాత్రం మూసివేస్తామని ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. కేవలం అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఏప్రిల్ 20 నుంచి పలు పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలకు కేంద్రం సూచించిన విధంగా ఆంక్షలు సడలించి అనుమతులిస్తామని తెలిపారు.
కాగా మహారాష్ట్రలో మొత్తం 3648 కరోనా కేసులు నమోదు కాగా.. కేవలం ముంబైలోనే 2268 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆ కేసుల సంఖ్య అక్కడ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ సీఎం ఉద్ధవ్ థాకరే ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం విశేషం.