దేశవ్యాప్తంగా 4వ విడత లాక్‌డౌన్‌ను మే 18 నుంచి మే 31వ తేదీ వరకు అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 50 శాతం వరకు కేసులు ఈ దశలోనే నమోదు కావడం విశేషం. ఆదివారం వరకు ఒక్క లాక్‌డౌన్ 4.0లోనే 85,974 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక చాలా వరకు కార్యకలాపాలకు కూడా ఇదే దశలోనే ఆంక్షలను సడలించారు. అందువల్లే పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
మే 31వ తేదీతో ముగిసిన లాక్‌డౌన్ 4.0లో 47.20 శాతం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. మార్చి 25 నుంచి 21 రోజుల పాటు విధించబడిన లాక్‌డౌన్ తొలి దశలో 10,877 కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు 19 రోజుల పాటు విధించబడిన లాక్‌డౌన్ 2వ దశలో 31,094 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మే 17వ తేదీతో ముగిసిన లాక్‌డౌన్ 3.0.. 14 రోజుల పాటు కొనసాగగా ఇందులో 53,646 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 24వ తేదీ వరకు దేశంలో కేవలం 512 కరోనా కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం.
కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు కాబడిన దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో జనవరి 30వ తేదీన నమోదైంది. వూహాన్ నుంచి వచ్చిన ఓ మెడికల్ స్టూడెంట్‌కు మొదట కరోనా వచ్చింది. కాగా ఆదివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 8,380 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 1,82,143కు చేరుకుంది. అలాగే 5,164 మంది కరోనాతో మరణించారు. ఈ వివరాలను కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 89,995 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 86,983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 47.75కు చేరుకుంది. కాగా జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ 5.0 కొనసాగనున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని ఆంక్షలకు సడలింపులు ఇచ్చింది. జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక జూలైలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.