కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో ఇప్పటికే అనేక రంగాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో వ్యాపారాలు ఆగిపోయాయి. ఇక ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి కి ఏప్రిల్ నెలలో తీవ్రమైన నష్టం సంభవించింది. ఆ నెలలో ఆ కంపెనీకి చెందిన కార్లు ఒక్కటి కూడా అమ్ముడవలేదు. లాక్‌డౌన్ కారణంగా కార్లు, వాటి విడి భాగాల తయారీ పరిశ్రమలు మూసి ఉండడమే ఇందుకు కారణం.
ఏప్రిల్ నెలలో మారుతీ కార్ల విక్రయాలు సున్నాగా నమోదయ్యాయని ఆ కంపెనీ తెలియజేసింది. తొలి విడత లాక్‌డౌన్ ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉన్నప్పటికీ దాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించడంతో ఏప్రిల్ నెలలో అస్సలు పరిశ్రమలు ఓపెన్ కాలేదు. దీంతోపాటు ఆ కంపెనీ షోరూంలు కూడా మూసి ఉన్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీ కార్లను అస్సలు ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో మారుతీ కార్ల విక్రయాలు అసలు జరగక.. సేల్స్ సున్నాగా నమోదయ్యాయి.
కాగా పలు ఇతర కంపెనీలకు చెందిన కార్లు, మోటారు వాహనాలకు కూడా మారుతి సుజుకి విడి భాగాలను తయారు చేసి ఇస్తుంటుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ పరిశ్రమలు కూడా మూసి ఉండడంతో ఆ విక్రయాలు కూడా అసలు జరగలేదని ఆ సంస్థ తెలిపింది. అయితే విదేశాలకు మాత్రం 632 యూనిట్లను ఎగుమతి చేసినట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇక మార్చి నెలలో 92,540 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ తెలియజేసింది. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో మారుతి సుజుకి కంపెనీ జూన్ 30వ తేదీ వరకు కార్ల ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ తేదీల గడువును పొడిగించినట్లు గతంలోనే తెలిపింది.