ఈ నాసల్‌ స్ప్రేతో 99 శాతం కరోనా అంతం

గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి శాత్రవేత్తలు వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. అలానే కరోనాని అంతం చేయడానికి పలు టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలానే కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఫార్మా కంపెనీలు కూడా మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక తాజాగా కరోనాపై పోరుకు నాసల్‌ స్ప్రేలు అందుబాటులోకి వచ్చాయి.

కరోనాకు ఎంట్రీ పాయింట్ అయిన ముక్కులో ఈ నాసల్‌ స్ప్రేను వేయడం ద్వారా వైరస్‌కు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనడాకు చెందిన శానోటైజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాసల్‌ స్ప్రే (ఎన్‌ఓఎన్‌ఎస్‌)ను తయారు చేసింది. ఇది ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్‌ను చంపేస్తుందని ఆ సంస్థ తెలిపింది. కరోనా రోగుల్లో దాదాపు 99 శాతం వరకు వైరల్‌ లోడును నిర్మూలిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

కాగా కరోనా వైరస్‌ తొలుత ఎగువ శ్వాసనాళాల్లో పాగా వేసి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. అయితే నాసల్‌ స్ప్రే ఎగువ శ్వాసనాళాల్లోని వైరల్‌ లోడును నిర్మూలిస్తుండడంతో వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాసల్‌ స్ప్రేను 79 మంది కోవిడ్ బాధితులపై ప్రయోగించగా వారిలో 24 గంటల్లోనే 95 శాతం మేర వైరల్‌ లోడు తగ్గిపోయింది. ఇక 72 గంటల్లో 99 శాతం వరకు వైరస్‌ కనుమరుగైంది. కాగా ఇజ్రాయెల్, న్యూజిలాండ్‌ దేశాలు ఈ నాసల్‌ స్ప్రే వినియోగానికి అనుమతులు కూడా ఇవ్వగా… మన దేశంలోనూ దీన్ని ఉత్పత్తి చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.