ఫ్యాక్ట్‌చెక్‌: మే 3 లాక్‌డౌన్‌ విధింపులో నిజమెంత..?

-

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఒక్కరోజే 4,01,993 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరగా.. ప్రస్తుతం 32 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే తీవ్రత అధికం కావడంతో మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారనే ఊహాగానాలు సోషల్‌మీడియాలో ప్రచారం జోరందుకున్నాయి.

అయితే ఈ ఊహాగానాలపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ టీం స్పష్టతనిచ్చింది. ‘‘మే 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశ వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ విధించనున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కేంద్రం అలాంటి ప్రకటనేమీ చేయలేదన్న పీఐబీ తేల్చిచెప్పింది. అయితే మే 3 నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నారని ఓ టీవీ ఛానల్‌ ప్రసారం చేసినట్లుగా ఉన్న పోస్టులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్‌ అయ్యాయి. దీనిపై సదరు ఛానెల్ స్పందిస్తూ తాము అలాంటి వార్తలేమీ ప్రసారం చేయలేదని వివరణ ఇచ్చింది.

అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించే యోచన లేదని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు మే 31 వరకు కరోనా ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అయితే కరోనా కట్టడిపై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టు పలు రాష్ట్రాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news