కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అనుమానితులను ఆస్పత్రులకు పంపి కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌లో దొరకకుండా ఉండేందుకు గాను ప్రయాణికులు అనుసరిస్తున్న విధానం తెలిసి అధికారులే షాకవుతున్నారు. ఇంతకీ.. అసలు విషయం ఏమిటంటే…
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్‌కు దొరకకుండా ఉండేందుకు గాను పారాసిటమాల్ గోలీలను మింగుతున్నారు. విమానం దిగడానికి సరిగ్గా గంట ముందు ఆ మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో ఎయిర్‌పోర్టులో దిగే సరికి ఆటోమేటిగ్గా వారి టెంపరేచర్ తగ్గుతోంది. దీంతో ప్రయాణికులను సి కేటగిరి కింద భావించి వారిని నేరుగా ఇండ్లకు పంపుతున్నారు. ఇలా వారు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ నుంచి తప్పించుకుంటున్నారు.
థర్మల్ స్క్రీనింగ్‌లో దొరికితే ఎక్కడ తమను హాస్పిటల్‌కు పంపుతారేమోనన్న భయంతోనే వారు ఇలా పారాసిటమాల్ మందులను మింగుతున్నారని అధికారులు తెలుసుకున్నారు. అయితే ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం తెలియజేసింది. గత రెండు రోజుల కిందట ఓ వ్యక్తి ఇలాగే దుబాయ్ నుంచి వచ్చి పారాసిటమాల్ మాత్ర వేసుకున్నాడని, దీంతో అతను థర్మల్ స్క్రీనింగ్‌కు దొరకలేదని, అతను నేరుగా ఇంటికి వెళ్లాడని తెలిపారు. కనుక ఇలాంటి వారిని మరింత చాకచక్యంగా గుర్తించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.