న్యూఢిల్లీ- 15 వేల కోట్ల కరోనా నిధిని కేంద్ర ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికగా మంజూరు చేసింది. రాష్ర్టీయ, జాతీయ వైద్య వ్యవస్థలను పరిపుష్టం చేయడమే పరమావధిగా దీన్ని వినియోగించనున్నారు.
ఈ కొవిడ్-19 అత్యవసర సహాయ మరియు వైద్య సన్నద్ధతా నిధిని మూడు దఫాలుగా అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. జనవరి 2020 నుండి జూన్ 2020, జులై 2020 నుండి మార్చి 2021, ఏప్రిల్ 2021 నుండి మార్చి 2024 వరకు అన్ని రాష్ర్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించి అందజేయనున్నది. ఇది వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధుల నుండే ఖర్చు చేస్తారు.
ఈ ప్రణాళిక కింద కరోనా ప్రత్యేక ఆసుపత్రులు, ఐసీయూలు, ఆక్సిజన్ సరఫరాలను చేపడతారు. కరోనా అత్యవసర పరిస్థితిని ఆధారంగా చేసుకుని, జాతీయ, రాష్ర్టీయ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయడం, ముందుజాగ్రత్తచర్యలు, వైద్య సన్నద్ధత, ముఖ్యమైన వైద్య పరికరాలు, వినియోగసామాగ్రి, ఔషధాలు, ప్రయోగశాలలు, జీవ భద్రతా వ్యవస్థలను నెలకొల్పడం లాంటి వాటికోసం ఈ నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ ఒక సర్కులర్ ద్వారా తెలిపింది.
మొదటి దఫా కింద ఆసుపత్రులను ఇన్ఫెక్షన్-ఫ్రీగా చేయడం, పీపీఈలు(వ్యక్తిగత రక్షణ పరికరాలు), ఎన్-95 మాస్కులు కొనుగోలు చేయడం చేపడతారు.
కరోనా విపత్తు చాలా రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలో పడేసింది. ఖర్చులు తగ్గించుకునే పనిలో అవన్నీ తలమునకలుగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ ఉద్యోగుల జీతాలలో సైతం కోత విధించాయి. ఢిల్లీ జీతాలు తప్ప మిగతా ఖర్చులను ఆపేసింది. మూడు వారాల లాక్డౌన్ వల్ల రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోతుండడం అందరినీ ఆందోళనలో పడేసింది. కేంద్రం కూడా ఇదే దారిలో పయనించి ఎంపీలాడ్స్ను ఆపేయడం, ప్రజాప్రతినిధుల జీతాలలో 30శాతం కోత విధించడం చేసింది. గతవారమే జాతీయ విపత్తు నిర్వహణా నిధి కింద 11, 092 కోట్లను విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడుకోవచ్చని రాష్ట్రాలకు ఊరటనిచ్చింది.
ఇదిలా ఉండగా, ప్రపంచబ్యాంకు 1 బిలియన్ డాలర్లను (దాదాపు 7200 కోట్ల రూపాయలు) భారత్కు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి, ప్రయోగశాలలను మెరుగుపరచుకోవడానికి వాడాలని సూచించింది.