అమెరికాలో పరిస్థితి చేతులు దాటుతోంది

-

అమెరికా లక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులతో అగ్రస్థానానికి చేరుకుంది. అధ్యక్షుడి నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తోంది. రాష్ట్రాలకు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇలాగే ఉంటే మొత్తం జనాభాలో 60శాతం మంది వైరస్‌ బారిన పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచానికే పెద్ద దిక్కుగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. మొదటినుంచీ తీవ్ర నిర్లక్ష్యం వహించిన అధ్యక్షుడు ట్రంప్‌ నేడు ఫలితం అనుభవిస్తున్నాడు. ఇది జస్ట్‌ ఫ్లూ లాంటిదే… తగ్గిపోతుందని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్‌, గంటగంటకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులను చూస్తూ బెంబేలెత్తిపోతున్నాడు. హుటాహుటిన 2 ట్రిలియన్‌ డాలర్ల కరోనా రిలీఫ్‌ ప్యాకేజికి తల ఊపాడు.

అమెరికా వైద్య వ్యవస్థ మొత్తం ప్రయివేటు సంస్థల చేతిలోనే ఉండటం ఇప్పుడు అశనిపాతంగా మారింది. ఆరుబయట, స్టేడియాలలో గుడారాలు వేసి పేషెంట్లను ట్రీట్ చేయాల్సివస్తోంది. పెరుగుతున్న పేషెంట్లకు కాదు, ప్రస్తుతం ఉన్నవారికి కూడా సరిపోను వెంటిలేటర్లు, మాస్క్‌లు, టెస్ట్‌ కిట్లు లేవు. ఇక నిరంతరం శ్రమిస్తున్న వైద్య, పారామెడికల్‌, సానిటేషన్‌ సిబ్బందికి కూడా కనీసం మాస్క్‌లు లేవు. పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. అయినా, లాక్‌డౌన్‌కు ఇంకా అధ్యక్షుడు ఒప్పుకోలేదు.

1,04, 256 పాజిటివ్‌ కేసులు, 1704 మరణాలతో అమెరికా అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ 48వేలకు పైగా కేసులతో కడు దైన్యస్థితిలో ఉంది. దాని పక్కనే ఉన్న న్యూజెర్సీ, కాలిఫోర్నియాలలో తెలుగువారు అత్యధికంగా నివసిస్తుంటారు. ఇళ్లలోంచి ఎవరూ  బయటకు రావడంలేదు. వారిని ప్రస్తుతం అదొక్కటే కాపాడుతోంది.

వందరోజులలో లక్ష వెంటిలేటర్లు తెప్పిస్తానని గంభీరంగా చెబుతున్న ట్రంప్‌, కార్ల తయారీ సంస్థ జనరల్‌ మోటార్స్‌ను వెంటిలేటర్లు తయారుచేయడానికి అనువుగా తన ఫ్యాక్టరీలను మార్చుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. దాదాపు 33కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 60శాతం మందికి కరోనా సోకే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యుమో మాటల్లో నిర్వేదం ధ్వనిస్తోంది. ఎవరు, ఎక్కడా చూడని యుద్ధాన్ని మనం చేయాల్సివస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. న్యూయార్క్‌లో అన్ని ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. కొత్తగా వస్తున్న కేసులకు బెడ్లు లేవు. మాకు ఐసీయు బెడ్లు కావాలని గవర్నర్‌ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

టెస్టులు విరివిగా జరగాల్సిన ఈ సమయంలో, తాము అన్ని దేశాలకంటే ఎక్కువగా 5,52,000 మందికి పరీక్షలు నిర్వహించామని, మొత్తం 50 రాష్ట్రాల్లో టెస్టు సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రకటించినా, అదంతా అబద్ధమేనని మీడియా మొత్తుకుంటోంది.

ఇటలీ, స్పెయిన్‌లలాగే, అమెరికా కూడా చేతులు కాలాక, ఆకులు పట్టుకున్నట్లు చేస్తోంది. ఫలితం కూడా ఆ దేశాల మాదిరిగానే ఉండబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news