దేశమంతటా కరోనా దెబ్బకు ప్రజలు విలవిలాడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు, ఉపాధి కూలీలు దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి.. కనీసం పూట తిండికి కూడా నోచుకోవడం లేదు. దీంతో వారి ఆకలిని తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. అందులో భాగంగానే కేరళలో మహిళా స్వయం సహాయక బృందాలు ఇప్పుడు అక్కడి అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నాయి.
కేరళలోని త్రిక్కకర కేంద్రంగా పనిచేసే కుదుంబశ్రీ అనే మేక్‌షిఫ్ట్ కమ్యూనిటీలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు భాగంగా పనిచేస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో మొత్తం 43 లక్షల మంది మహిళలు ఉన్నారు. కుదుంబశ్రీ నెట్‌వర్క్ 1997లో ప్రారంభం కాగా ఈ సంస్థ మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. దీంతో చాలా మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. అయితే ఇప్పుడిదే సంస్థ తరఫున కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సదరు 43 లక్షల మంది మహిళలు వలస కార్మికులు, కూలీల ఆకలి తీర్చడమే ధ్యేయంగా నిత్యం పనిచేస్తున్నారు.
దేశమంతటా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ వలస కార్మికులు, నిరాశ్రయులైన కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇక కేరళలోనూ ఇలాంటి వారు తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. దీంతో స్పందించిన కుదుంబశ్రీ తమ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న కొన్ని లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆ నెట్‌వర్క్ వారు ఎక్కడికక్కడ కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేశారు. ఆ కిచెన్‌ల ద్వారా అన్నార్థులకు మహిళలు భోజనం వడ్డిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళలు ఎంతో మందికి నిత్యం ఆహారం పంపిస్తూ మీకు మేమున్నామని ధైర్యం చెబుతున్నారు. ఆ మహిళలు చేస్తున్న సేవలను నిజంగా మనమందరం అభినందించాల్సిందే..!