కార్తీక మాసం : వైశ్రవణుడు కుబేరుడు ఎలా అయ్యాడు?

-

కుబేరుడు అంటే అందరికీ తెలుసు. కానీ అసలు ఆయన పేరు వైశ్రవణుడు. ఆయన సాక్షాత్తు రావణాసురుడికి సోదరుడు. లంకా నగరాన్ని అత్యంత సుందరంగా అద్భుతంగా నిర్మించుకున్నది వైశ్రవణుడు. అయితే సోదరుడు అయిన రావణుడు తనపైకి దండెత్తిరావడంతో వైశ్రవణుడు నిర్ఘాంతపోయాడు. వైశ్రవణుడు శివభక్తుడు. అయితేనేం యుద్ధానికి తలపడింది మహా బలవంతుడు. అందుకే ధైర్యం సన్నగిల్లి వైశ్రవణుడు గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు. తన ఆపదను తల్చుకుని దుఃఖిస్తూ దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు.

వైశ్రవణుడి తపో దీక్షకు మహాశివుడు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. జరిగిన వృత్తాంతాన్ని వైశ్రవణుడు పరమశివుడికి చెప్పాడు. అది విన్న మహాదేవుడు.. లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వేం దిగులుపడకు.. నీ తపస్సుకు మెచ్చాను. నీకు లంకా పట్టణాన్ని మించిన అందమైన, అద్భుతమైన, అపూర్వమైన నగరాన్ని ప్రాప్తింప చేస్తాను. నవ నిధులకూ నువ్వు నాయకుడివి అయ్యేలా వరం ఇస్తున్నాను. ఇకపై నీ పేరు వైశ్రవణుడు కాదు, కుబేరుడు. నీకు అనంతమైన సంపదలు ఇస్తున్నాను. నువ్వు అందరికంటే సంపన్నుడివి అవుతావు. నువ్వు నివసించే నగరం సుబిక్షంగా, సుసంపన్నంగా వర్ధిల్లుతుంది. రావణాసురుని మించిన ధనవంతుడివి కాబోతున్నావు. రాబోయే కాలంలో ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ గురించే చెప్పుకుంటారు.. అంటూ వరం ఇచ్చాడు. అప్పటి నుంచి వైశ్రవణుడు పరమశివుడి దగ్గరే ఉంటున్నాడు.

అంతేకాదు లోకంలో ధనానికి అధిదేవత లక్ష్మీ దేవి అయితే ధనానికి అధిపతిగా కుబేరుడిని శివుడు నియమించాడు. సకలలోకాలల్లో అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే కుబేరుడు అని ఠక్కున చెప్పేస్థాయికి వెళ్లిపోయాడు. అంతా పరమశివుడి అనుగ్రహం. ఇప్పటికీ చాలా డబ్బు ఉంది అనే చెప్పదలచుకుంటే కుబేరుడినే తలచుకుంటాం. వైశ్రవణుడు కాస్తా కుబేరుడుగా అయ్యాడు. పరమశివుడి అనుగ్రహం ఉంటే మీరు కుబేరులు కాగలరు. ఇక ఆలస్యమెందుకు పరమభక్తితో శివయ్యను కొలవండి ఐశ్వర్యవంతులు కండి.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news