తల్లి గా, భార్య గా కుటుంబ భాద్యతలను సక్రమంగా నిర్వర్తించడం లోనే కాదు, దేశానికి రక్షణ గా ముందు నిలబడే శక్తి ఒక స్త్రీ కి కూడా ఉంది అని తన ప్రాణత్యాగం ద్వారా నిరూపించారు కమలేష్ కుమారి యాదవ్. యావత్ భారతదేశ భవిష్యత్ నీ నిర్దేశించే చోటు మన పార్లమెంటు. భారత ప్రజల కోసం తయారు చేసిన రాజ్యాంగాన్ని పార్లమెంటు సాక్షిగా ముందుకు నడిపిస్తూ, సమయానుకూలంగా ప్రజలకు అవసరమైన చట్టాలు చేసే చోటు పార్లమెంటు.
అటువంటి పార్లమెంటు నీ ఆపద సమయంలో ప్రాణత్యాగం చేసి కాపాడింది కమలేశ్ కుమారి యాదవ్. 2001 లో పార్లమెంట్ పై జరిగిన దాడి లో ఆమె ధైర్య సాహసాలే పార్లమెంట్ ని కాపాడాయి. 1994 లో సిపిఆర్ఎఫ్లో చేరారు కానిస్టేబుల్ కమలేష్ కుమారి యాదవ్. మొదట అలహాబాద్‌లోని ఎలైట్ 104 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఐఎఫ్) తో ఆమెకు పోస్టింగ్ వచ్చింది, ఆ వెంటనే ఆమెను 12 జూలై 2001 న 88 మహిళా (ఉమెన్స్) బెటాలియన్‌లో నియమించారు.
ఈ బృందాన్ని పార్లమెంట్ భద్రతా విధుల్లో నియమించారు దీన్లో కమలేష్ కుమారి యాదవ్ కూడా ఉన్నారు. పార్లమెంట్ హౌస్, బిల్డింగ్ గేట్ నెంబర్ 11 పక్కన ఉన్న ఐరన్ గేట్ నంబర్ 1 వద్ద కమలేష్ కుమారి డ్యూటీ లో ఉన్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆమె లైసెన్స్ ప్లేట్ నంబర్ DL 3C J 1527 ను కలిగి ఉన్న ఒక అంబాసిడర్ బ్రాండ్ కారు విజయ్ చౌక్ నుండి గేట్ వైపు రావడం చూశారు. అనుమానం వచ్చి కారుని గమనించిన ఆమె ఏదో జరుగుతుంది అని భావించి గేట్ మూసేయడనికి పోస్ట్ వద్దకు పరుగెత్తుకు వెళ్లి కారు ముందుకు రానివ్వకుండా ప్రతిఘటించారు.
కారు ముందుకి వెళ్ళలేకపోయింది. దీనితో వెంటనే ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కమలెష్ కుమారి కడుపులోకి 11 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో ఆమె తన ధైర్యంతో, చొరవతో గేట్ 1 ను మూసివేయడం మరియు అలారం మోగించడంతో ఇతర భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
కమలేష్ కుమారి యాదవ్ అప్రమత్తత పార్లమెంటు పై ఉగ్రవాదుల దాడిను అడ్డుకుంది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దళాన్ని నిరోధించింది దీనితో అక్కడి రక్షణ సిబ్బంది ఉగ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సంఘటన లో కమలేష్ కుమారి చూపిన ధైర్య సాహసాలకు, ప్రాణత్యాగానికి 2003 లో భారత ప్రభుత్వం అశోక చక్ర ఇచ్చి సత్కరించారు.