జగదీశ్‌రెడ్డి హత్యకు కుట్ర..?

-

స్వగ్రామంలో రెక్కీ…?
డ్రోన్లతో చిత్రీకరించిన వైనం
గ్రామంలో తీవ్ర భయాందోళనలు

విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదా? స్థానికుల కథనం ప్రకారం ఈనెల రెండో తేదీన జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారంలో గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానాలు బలపడుతున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి డ్రోన్ సాయంతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు, అటు నుంచి తుంగతుర్తి రోడ్డు, హెల్త్‌సెంటర్ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులనూ, గ్రామం నుంచి బయటికి వెళ్లే డొంక రోడ్లనూ చిత్రీకరించారని చూసిన గ్రామస్తులు చెబుతున్నారు. చివరగా మంత్రి ఇంటి పరిసరాలను కూడా చిత్రీకరించారని వారు చెబుతున్నారు. రోడ్ల వెడల్పు పనులు జరుగుతున్నందున, వాటికి సంబంధించిన సర్వేలాంటిదేదో అనుకున్నామని, కాని మంత్రి నివాసప్రాంతంపై కూడా డ్రోన్లు తిరుగాడటంతో తమకు సందేహం కలిగిందని గ్రామస్థులు తెలిపారు.

మంత్రి స్వగ్రామానికి వచ్చినపుడు సెక్యూరిటీని పక్కనబెట్టి గ్రామస్తులతో కలసిపోతారు. ముసలీ ముతకా తేడా లేకుండా అందరితో ఆత్మీయంగా మాట్లాడతారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ, ఇళ్లల్లోకి చొరవగా చొచ్చుకెళుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. తనకు బాగా సన్నిహితంగా ఉండే ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇండ్లల్లోకి వెళ్లి, అందరి బాగోగులు తెలుసుకుంటారు. ఇటువంటి సందర్భాన్ని ఆసరాగా తీసుకుని దాడిచేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా సురక్షితంగా తప్పించుకోవచ్చన్న భావనతో వారు ఈ రెక్కీ చేసి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్‌రెడ్డి మళ్లీ ఘనవిజయం సాధించే వాతావరణం స్పష్టంగా కనబడుతుండడం, సర్వేలన్నీ అదే చెబుతూండడంతో పాత నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది. భౌతికంగా నిర్మూలిస్తే గాని తమకు అవకాశం రాదని తలచిన వాళ్లు, ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిఉంటారని మంత్రి అనుయాయులు, బంధుగణం భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version