తీవ్రవాద ప్రేరేపిత చర్యలు కారణంగా అతడు మన కశ్మీరులో ఎన్నో ఊచకోతలకు కారణం అయ్యాడు. పేరు బిట్టా కరాటే. అతడు ఎందరో పండిట్లను హతమార్చినా కూడా ఇంతవరకూ జైలు శిక్ష అనుభవించిన దాఖాలాలే లేవు. దీంతో నాటి కశ్మీర్ పండిట్ల ఊచకోతకు సంబంధించిన గాయాలను బాధితులు మోస్తూనే ఉన్నారు. తాజాగా ఓకేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మళ్లీ నాటి మారణ కాండ కళ్లెదుట కదలాడుతోంది.
ఉగ్రవాది బిట్టా కరాటే పై పలు హత్యా నేరాలు నమోదయి ఉన్న నేపథ్యంలో అతను అరెస్టు అయినా సరైన సాక్షాధారాలు లేనందున విడుదల సులువు అవుతుందని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో జరిగిన దారుణ మారణ కాండలు ఏళ్లు గడుస్తున్నా సంబంధిత బాధితులకు న్యాయం కాని సందర్భాలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద చర్యలు ఇన్నేళ్లయిన కశ్మీరు లోయల్లో నియంత్రణకు నోచుకోకపోగా, కొన్ని చోట్ల నాటి ఘటనల బాధితులు కొన ఊపిరితో కాలం గడుపుతున్నారు. బిట్టా కారాటే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్రవాద శిక్షణ పొందాడని తెలుస్తోంది. చాలా మంది పండిట్లను అత్యంత పాశవికంగా చంపాడన్న ఆధారాలున్నాయి.
ఈ దశలో కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది తమ గోడు చెప్పుకుంటూనే నాటి ఘటనకు సంబంధించి బాధ్యులను శిక్షించాలని వేడుకుంటున్నారు. ముఖ్యంగా కశ్మీర్ పండిట్ సతీశ్ టిక్కా హత్య కేసుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 31 ఏళ్ల తరువాత ఈ కేసు విచారణకు శ్రీనగర్ కోర్టు సమ్మతించింది. హత్యకు కారణం అయిన బిట్టా కరాటే పై ఇంతవరుకూ ఎందుకు ఛార్జిషీటు దాఖలు చేయలేదని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిందని ప్రఖ్యాత ఛానెల్ బీబీసీ చెబుతోంది. ఫరూక్ అహ్మద్ దర్ అలియాస్ బిట్టా కరాటే అనేక మంది కశ్మీరు పండిట్లను చంపాడనేందుకు ఆధారాలున్నా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. గతంలో ఆయన చాలా సార్లు అరెస్టు అయినా సరైన ఆధారాలు లేవన్న కారణంతో జైలు నుంచి విడుదలయ్యాడు.