వందల ఏళ్లనుంచి సూర్యుడు తాకని గ్రామం..ఆ ఇంజనీర్ ఐడియాతో తీరిన సమస్య

ఉదయాన్నే సూర్యకిరణాలు తాకుతుంటే..మనసుకు చాలా హాయిగా ఉంటుంది. కాసేపు అలా కుర్చుంటే రోజంతా మంచి ఉత్సాహంగా ఉంటుంది. ఉరుకులపరుగుల జీవితంలో రోజును ఇలా స్టాట్ చేసే వాళ్లు చాలా అరుదు..కానీ అలా చేద్దామన్నా వారి గ్రామం మీదకు సూర్యుడే రాడట. చుట్టూ ఎత్తయిన పర్వతాలు. ఆ పర్వత శ్రేణిలో లోతైన లోయ. అందులో ఓ చిన్నగ్రామం. 200 మంది వరకూ ఉంటారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు అసలు సూర్యుడే కనిపించేవాడు కాదు. దీంతో వారందరిలోనూ ఓ రకమైన మానసిక ఆందోళన మొదలైంది. అలా వందల ఏళ్లు గడిచాయి. కానీ ఇటీవల ఓ ఇంజినీర్‌ ఆలోచన వారి ఇళ్లల్లో కాంతులు ప్రసరించేలా చేసింది.

ఇటలీలోని ఉత్తర్‌ మిలాన్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే విగనెల్లా ఓ మారుమూల గ్రామం. స్థానిక ఆర్కిటెక్ట్‌తో కలిసి కొండవాలు ప్రాంతంలో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. గ్రామస్థులంతా కలిసి లక్ష యూరోల ధనాన్ని పోగు చేసి ఇచ్చారు. స్థానిక నాయకుల సహకారంతో 1.1 టన్నుల బరువున్న అద్దాన్ని 1,100 మీటర్ల ఎత్తులో ఏటవాలుగా బిగించారు. ఈ పని చేయడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. సూర్యకాంతి అద్దం మీద పడి గ్రామంపై పరావర్తనం చెందే విధంగా దీనిని ఏర్పాటు చేశారు.

సూర్యక్రాంతి ప్రసరించే మార్గానికి అభిముఖంగా అద్దం దానంతట అది తిరిగేటట్లు సాంకేతికత పరిజ్ఞానం వినియోగించారు. ఈ అద్దంతో గ్రామం మొత్తం వెలుగులు ఇవ్వలేకపోయినా.. 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కాంతిని ప్రసరింపజేయవచ్చు. అందువల్ల ఊరి మధ్యలో ఉన్న చర్చిపై కాంతిపడేలా ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా అక్కడే గుమిగూడుతుంటారు. ఊరి మధ్యలో కాంతి పడటం వల్ల ఆ వెలుతురు దాదాపు గ్రామమంతా విస్తరిస్తోంది. అద్దం ఏర్పాటు చేసిన తర్వాత తమ ప్రవర్తనలోనూ, ఆలోచనా విధానంలోనూ మార్పులు వచ్చినట్లు అక్కడివాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విగనెల్లా అద్దం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంటోంది.

ఇంజనీర్ చేసిన అద్భుత ప్రయోగాన్ని అందరూ అభినందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి ఉన్న సమస్యను ఆ ఇంజనీర్ దాదాపు నయం చేశాడని అక్కడి వారి ఆనందానికి హద్దులు లేవు.