కొన్ని దేశాలలో వింతైన చట్టాలు ఉంటాయి. వాటి గురించి మనం ముందుగానే తెలుసుకుంటే మంచిది. లేదంటే ఆ దేశానికి వెళ్లినప్పుడు మనం ఏదైనా తెలియకుండా తప్పు చేస్తే అనవసరంగా జైలు పాలు కావల్సి వస్తుంది.
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఒకే తరహా చట్టాలు, నిబంధనలు ఉండవు కదా. కొన్ని దేశాలలో వింతైన చట్టాలు ఉంటాయి. వాటి గురించి మనం ముందుగానే తెలుసుకుంటే మంచిది. లేదంటే ఆ దేశానికి వెళ్లినప్పుడు మనం ఏదైనా తెలియకుండా తప్పు చేస్తే అనవసరంగా జైలు పాలు కావల్సి వస్తుంది. అవును.. బీచ్ అందాలను చూద్దామని ఆ దేశానికి వెళ్లిన ఆ జంటకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఇటలీ దేశంలోని సర్దినియా అనే దీవిలో బీచ్‌లు భలే అందంగా ఉంటాయి. ఎటు చూసినా తెల్లగా ఉండే ఇసుక బీచ్‌లో మెరుస్తూ కనిపిస్తుంది. దీంతో ఆ బీచ్‌లలో సేదదీరేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. అయితే ఓ ఫ్రెంచ్ జంట కూడా ఆ బీచ్‌కు వెళ్లింది. ఆ బీచ్‌లో ఉన్న తెల్లని ఇసుకుకు వారు ముగ్ధులయ్యారు. దీంతో కొద్దిగా ఇసుకను తమతోపాటు తీసుకువెళ్లాలని అనుకున్నారు. అలా వారు ఆ బీచ్‌లోని ఇసుకను 14 సీసాల్లో నింపుకున్నారు. అయితే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో రోడ్డుపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వారి ఇసుక సీసాలు లభించాయి. దీంతో ఆ పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక ఆ జంటకు అక్కడి కోర్టు ఏకంగా 6 ఏళ్ల జైలు శిక్షను కూడా విధించింది.
అయితే కేవలం ఇసుకను తీసుకెళ్తేనే జైలు శిక్ష వేస్తారా..? అని అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అసలు విషయం తెలిస్తే ఎవరైనా అది కరెక్టేనంటారు. ఎందుకంటే.. సదరు సర్దినియా దీవిలో ఏటా కొన్ని లక్షల టన్నుల ఇసుక మాయమవుతోందట. దీంతోపాటు అక్కడి బీచ్‌లు, సముద్రంలో లభించే పలు రాళ్లు, గవ్వలను కొందరు పెద్ద ఎత్తున చాటుగా సేకరించి భారీ ధరకు అమ్ముకుంటున్నారట. దీంతో ఆ దీవి తీవ్రంగా కోతకు గురవుతోందట. ఈ క్రమంలో ఆ దీవిని రక్షించడం కోసం ఆ దీవిలో లభించే ఇసుక, ఇతర వస్తువుల సేకరణపై ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ వస్తువులను ఇటలీ తమ ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తూ చట్టం చేసింది. దీంతో ఆ దీవిలో ఇసుక, ఇతర వస్తువులను ఎవరూ సేకరించకూడదు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఇసుకతోపాటు ఆ వస్తువులను అక్రమంగా తరలిస్తే వారిపై రూ.2.38 లక్షల భారీ జరిమానా విధించడంతోపాటు వారికి జైలుశిక్ష కూడా విధిస్తామని ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఆ విషయం తెలియని సదరు ఫ్రెంచ్ జంట ఇసుకను సేకరించి అడ్డంగా దొరికిపోయింది. చివరకు ఆ జంటను కటకటాల్లోకి నెట్టారు. అయితే తమకు ఆ విషయం తెలియదని, తాము ఇసుకను తమ పర్యటనకు గుర్తుగా దాచుకునేందుకే సేకరించామని ఆ దంపతులు ఎంత చెప్పినా కోర్టు కనికరించలేదట. దీంతో వారికి జైలుకు వెళ్లక తప్పలేదు. అవును మరి.. మనం ఏదైనా కొత్త దేశానికి వెళ్లినప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలను గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్తేనే మంచిది. లేదంటే ఆ ఫ్రెంచ్ జంటకు ఎదురైన చేదు అనుభవమే మనకూ ఎదురవుతుంది. కాబట్టి కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎంతైనా.. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది..!