సాధారణంగా మనం ఆఫీసులో ఉన్నా.. లేదంటే ఇంట్లో ఫుడ్ నచ్చకపోయినా.. ఇతర ఏ సందర్భంలో అయినా సరే కొన్ని సార్లు ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేస్తుంటాం. మనకు నచ్చిన ఫుడ్‌ను యాప్‌లు కేవలం కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనం పేమెంట్ పరంగా, ట్రాకింగ్ పరంగా సమస్యలను ఎదుర్కొంటుంటాం. ఫుడ్ కొన్ని సమయాల్లో ఆలస్యంగా డెలివరీ అవుతుంటుంది. ఇవన్నీ సహజమే. కానీ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఆ బాలికకు వింత సమస్య ఎదురైంది. అదేమిటంటే..
ఫిలిప్పీన్స్ లోని సెబు సిటీలో ఉన్న బరంగే మబొలొ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ 7 ఏళ్ల బాలిక ఫుడ్ పాండా యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేసింది. తన బామ్మ కోసం ఆమె రెండు బాక్సుల్లో ఫ్రైడ్ చికెన్ ఫిల్లెట్స్, రైస్‌ను ఆర్డర్ చేసింది. అయితే స్లో ఇంటర్నెట్ కనెక్షన్ కారణంగా ఆమె పదే పదే ఆర్డర్ బటన్‌ను ప్రెస్ చేసింది. చివరకు ఆర్డర్ ఓకే అయింది. కానీ తీరా చూస్తే ఆమె ఇంటికి మొత్తం 42 మంది డెలివరీ బాయ్‌లు అదే ఫుడ్‌ను పట్టుకొచ్చారు. కారణం.. ఆమె ఒక్కసారి ఆర్డర్ పెట్టానని అనుకుంది, కానీ 42 ఆర్డర్లు ఆటోమేటిగ్గా యాడ్ అయ్యాయి.
దీంతో సదరు బాలిక ఆ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా లైవ్ పెట్టింది. ఇక ఆ ప్రాంతమంతా ఫుడ్ డెలివరీ బాయ్‌లతో నిండిపోవడంతో చుట్టూ ఉన్న జనాలు కూడా ఏం జరుగుతుంది అని వాకబు చేస్తే అసలు విషయం తెలిసింది. అయితే ఆమె ఆర్డర్ చేసింది రెండు బాక్స్ లే కనుక అసలు బిల్ 189 పెసోలు అయింది. కానీ సాంకేతిక సమస్య వల్ల 42 ఆర్డర్లు రావడంతో ఆ బాలిక మొత్తం 7945 పెసోల బిల్లును కట్టాల్సి వచ్చింది. కానీ కాలనీవాసులు తలా ఒక ఆర్డర్‌ను తీసుకుని డబ్బులు ఇచ్చేశారు. దీంతో ఆ బాలిక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. లేదంటే 42 ఆర్డర్లకు బిల్ కట్టాల్సి వచ్చేది. కాగా ఆ బాలికకు ఎదురైన ఈ సంఘటన తాలూకు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.