భారత్ లో దేవుడ్ని ఏ స్థాయిలో ఆదరిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దైవం కోసం ప్రాణం ఇచ్చే జనం భారత్ లో ఎక్కడికి వెళ్ళినా కనపడుతూ ఉంటారు. భక్తి ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది గాని అది స్థాయి దాటితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పలానా దేవుడికి పూజలు చేస్తే ఈ మంచి జరుగుతుందని నమ్మి ఎవడో ఏదో చెప్పగానే ఆ దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక చిన్న పిల్లలను బలి ఇవ్వడం అదనం. దీనిపై ఏ విధంగా అవగాహన కల్పించినా సరే ప్రజల్లో పెద్దగా మార్పు రాదూ.
ముఖ్యంగా ఉత్తరభారతంలో ప్రజలు ఎక్కువగా పూజల మీద ఆధారపడుతు ఉంటారు. దేవుడు కనపడితే చాలు తమకు ఏదోక పుణ్యం జరుగుతుందని పూజలు చేస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా దీనిని బాగానే వాడుకునే ప్రయత్నం చేస్తాయి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా మౌదాహా గ్రామంకు చెందిన ప్రజలు కొన్నేళ్ళు గా ఒక మూసి ఉన్న భవనానికి పూజలు చేస్తున్నారు. దాని లోపల ఏం ఉంది ఏ దేవుడు ఉన్నాడు అనేది పక్కన పెడితే…
ఆ భవనానికి ఉన్న కాషాయ రంగు చూసి పూజలు చేయడం మొదలుపెట్టారు. కోళ్ళు, మేకలను కూడా బలి ఇస్తూ మరి పూజలు చేస్తున్నారు. ఇంతకి ఆ భవనంలో ఏం ఉంది అనేది ఆరా తీస్తే… ఒక కమ్యూనిటి హాల్ కోసం కట్టిన టాయిలెట్ అది. కాకపోతే దానికి కాషాయ రంగు వేసారు. కొన్ని కారణాల వలన వాడకుండా ఉన్న ఆ భవనాన్ని చూసి దేవుడి గుడి అనుకుని పూజలు చేసారు భక్తులు. గ్రామ శివారులో ఉన్న ఈ టాయిలెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఎలా ఉన్నా జనాల భక్తి మాత్రం విడ్డూరంగానే ఉంది.