కేవలం ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం మాత్రమే. కనీసం మంత్రిగానో లేదా విప్‌గానో ఏ పదవి లేకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్ సొంతం. పార్టీ పెట్టిన మూడేళ్లకే 67 సీట్లతో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న వైనం. అధికార పక్షంపై పోరాటం చేస్తూ ఏకంగ 3 వేల కిలోమీటర్ల పాటు చరిత్రలో నిలిచేలా పాదయాత్ర చేశాడు. చివరకు చరిత్రలో నిలిచేపోయే మెజార్టీ 151 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చాడు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లో జగన్ పాలన ఎలా ఉంది ? జగన్ చెపుతున్నట్టు ఈ కొత్త సంస్కరణలు ఫలిస్తున్నాయా ? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు, మేథావుల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. వాస్తవంగా చూస్తే ఏపీలో తీవ్రమైన లోటు బడ్జెట్ ఉంది. ఇలాంటి లోటు బడ్జెట్‌లో ఆరు నెలల పాలనలో అభివృద్ధి పరంగా కొత్తగా చేసిందేం లేదు. కీలకమైన పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.
అయితే తాను ముందు నుంచి చెపుతున్నట్టు సంస్కరణలు, పాలన వ్యవస్థను మార్చుతాను… చెడిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్న మాట మాత్రం నెరవేర్చే దిశగానే ముందుకు వెళుతున్నాడు.
పింఛన్లు, ఉద్యోగాలు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం, అగ్రిగోల్డ్ బాధితులకు సాయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేశారు. వీటితో పాటు ఏపీ సచివాలయంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో ? అచ్చం అలాగే ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలతో ఏకంగా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది యూత్లో జగన్‌కు పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఈ ఉద్యోగాలు రావడం వల్ల యువత, ఆ యువత కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఇక పింఛన్లు, రైతుభరోసా, అమ్మఒడి ఇలాంటి వాటి వల్ల ప్రతి ఒక్కరూ లబ్ది పొందుతూ…జగన్ పట్ల పాజిటివ్ గా ఉంటారు. మేజర్‌గా వ్యవస్థలో మార్పులు, ప్రజా సంక్షేమం అన్న టార్గెట్‌తోనే జగన్ ముందుకు వెళుతున్నాడు. ఇక రు.1000 దాటితే వైద్యం ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరించేలా వస్తోన్న పథకం కూడా త్వరలోనే అమల్లోకి రానుంది.
ఇక వలంటీర్ల వ్యవస్థ ద్వారా లక్షల మందికి చిన్నదో పెద్దదో ఉపాధి అనేది దొరికింది. ఇక ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్‌ను నిధుల కోసం అడుగుతున్నా జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు అభివృద్ధి అంటూ చేసింది కూడా లేదు. అయినా జగన్ మీద ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకు కారణం జగన్ అభివృద్ది పనుల మీద కాకుండా సరికొత్త పాలనతో ముందుకు వెళుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. ఇంకా నాలుగున్నరేళ్ల టైం ఉంది… అభివృద్ధి రుచి యేడాది దాటినప్పటి నుంచి చూపించాలన్నదే జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది.