వివాహం చేసుకునేవారు ప్రస్తుత తరుణంలో వెరైటీ మార్గాల్లో ఆ కార్యాలను జరుపుకుంటున్నారు. వినూత్న రీతిలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీంతో అలాంటి వారి శుభ కార్యాలు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. ప్రజలు వారి గురించే చర్చించుకుంటున్నారు. ఇక కోల్‌కతాలోనూ ఓ జంట ఇలాగే వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లిలో వెరైటీ ఏమీ లేదు, కానీ వారు ఇంకో ఆసక్తికరమైన పని చేశారు, అదేమిటంటే..
కోల్‌కతాకు చెందిన ఓ జంట తమ వివాహం సందర్భంగా వడ్డించిన వంటకాలకు గాను ఓ మెనూను రూపొందించింది. అయితే ఆ మెనూ ఆధార్ కార్డులా ఉంది. దీంతో ఆ వెడ్డింగ్ కార్డ్ మెనూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినూత్న రీతిలో వెడ్డింగ్ మెనూ కార్డ్‌ను డిజైన్ చేశారంటూ ఆ జంటను మెచ్చుకుంటున్నారు. కోల్‌కతాకు చెందిన గొగొల్ సాహా, సుబర్ణా దాస్‌లు ఫిబ్రవరి 1వ తేదీన వివాహం చేసుకోగా.. వారి పెళ్లి మెనూ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాహా, సుబర్ణా ఇద్దరూ కోల్‌కతాలోని రజర్‌హత్ అనే ఏరియాలో నివాసం ఉంటున్నారు. సాహా స్థానికంగా ఓ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, ఆమె హెల్త్ కేర్ ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తోంది. ఇలా ఎందుకు చేశారని అడిగితే డిజిటల్ ఇండియాకు తాము ఈ విధంగా మద్దతు తెలిపామని అన్నారు.