కేంద్ర బడ్జెట్‌ పై టీ కాంగ్రెస్ సైలెంట్..ఎందుకలా ?

-

అటు కేంద్రం ఇటు రాష్ట్రం అధికార పార్టీల దూకుడుతో చావో రేవో లాంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉంది. అయినా నాయకుల్లో కనీస స్పందన కరువవుతుంది. పార్టీలో పైచేయి కోసం కుస్తీ పట్టే నాయకులు అందులో కాస్తయినా.. కాంగ్రెస్‌ బలోపేతం కోసం కేటాయిస్తే పరిస్థితి మరోలా ఉంటుందనే కామెంట్స్‌ సొంత కేడర్ నుంచే వినిపిస్తుంటాయి. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎన్నడు లేని విధంగా మొండి చెయ్యి చూపినా టీ కాంగ్రెస్ లో స్పందించే నాయకులు కరువయ్యారట.


రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో ప్రస్తావించిన అంశాల్లో చాలా వరకు ఏడేళ్లుగా అమలుకు నోచుకోలేదు. బయ్యారం ఉక్కు.. గిరిజన యూనివర్సిటీ.. కాజీపేట రైల్వే కోచ్ కాగితాలకే పరిమితమయ్యాయి. వీటి గురించి కానీ.. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై కానీ బీజేపీని విమర్శించేందుకు తటపటాయిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఏ పార్టీ అయినా ఎదురుదెబ్బ తగిలితే జాగ్రత్త పడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తుంది.తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో ఇవేమీ కనిపించడం లేదు.

కేంద్ర బడ్జెట్‌ పై టీఆర్‌ఎస్‌ మౌనంగా ఉండటంతో ఇప్పటికే దీనిపై చర్చ జరుగుతుంది. అటు బీజేపీని.. ఇటు టీఆర్‌ఎస్‌ను పొలిటికల్‌గా కార్నర్‌ చేయాల్సింది పోయి సొంత అజెండాలతో యాత్రలు,ధర్నాలు చేయడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీస్తోంది. ఇక రాష్ట్ర నాయకత్వ స్పందనే అలా ఉంటే జిల్లాల్లో నాయకులు అడ్రస్ లేరు..ఒక ధర్నా లేదు..ఒక ప్రెస్‌మీట్‌ లేదు. కానీ పార్టీలో ఆధిపత్య పోరుకు.. ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు మాత్రం ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారనే చర్చ పార్టీలోనే జరుగుతుంది.

కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక ఇప్పటికే వాయిదా పడగా..ఇక మిగిలిన నేతలు కూడా ఎవరికి వారు నాకెందుకులే అని జారుకుంటున్నారట. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డ్ కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. అక్కడ రైతులకు బాసటగా నిలిచేందుకు బీజేపీ,టీఆర్ఎస్ రాజకీయం చేస్తుంటే ముందుండాల్సిన కాంగ్రెస్‌ నేతలు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవల ఆర్మూర్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి రైతు దీక్ష చేశారు. ఆ కార్యక్రమంలో రేవంత్ టీం మాత్రమే పాల్గొంది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర నాయకుల్లో ఎంపీ రేవంత్‌ అంటే సీఎల్పీ నేతకు పొసగదనే టాక్‌ ఉంది. అలాగే ఉత్తమ్‌ అంటే రేవంత్‌ అండ్‌ టీమ్‌కు నచ్చదట. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఇంకొకరికి పడదు. దీంతో సొంత అజెండాలు రూపొందించుకుని.. దానికి పార్టీ జెండా పెట్టేసి జనాల్లోకి వెళ్లిపోతున్నారు నాయకులు. కలిసినప్పుడు నేతలు కలివిడిగా కలరింగ్ ఇచ్చిన ఆ తర్వాత ఎవరి రాజకీయం వారిదే..వీరిని సమన్వయం చేయాల్సిన పార్టీ ఇంచార్జ్ ఎక్కడున్నారో ఎవరికి తెలీదు..కాంగ్రెస్ అంటే అంతే కదా మరి…

Read more RELATED
Recommended to you

Latest news