పాలను తాగడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. పాలలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. పాలలో అనేక పోషకాలు ఉంటాయి కనుక అవి మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. అయితే ఆ వ్యక్తి మాత్రం ఇంకో స్టెప్ ముందుకు వేసి ఏకంగా పాలతోనే స్నానం చేశాడు. అవును.. టర్కీలో ఈ సంఘటన జరిగింది.
టర్కీలోని కోన్యా అనే ప్రాంతంలో ఉన్న ఓ డెయిరీ సెంటర్‌లో పనిచేసే ఉగుర్ టట్‌గుట్ అనే వ్యక్తి సదరు పరిశ్రమలో టబ్‌లలో నిల్వ ఉండే పాలతో స్నానం చేశాడు. టబ్‌లో పడుకుని మరీ స్నానం చేశాడు. ఆ సమయంలో అతను వీడియో కూడా తీసుకున్నాడు. అయితే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే విషయం తెలియడంతో పోలీసులు ఆ డెయిరీ సెంటర్‌ను సీజ్ చేసి ఆ సెంటర్ యాజమాన్యంతోపాటు సదరు వర్కర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే డెయిరీ సెంటర్‌లో అతను స్నానం చేసిన టబ్ లు, వాడిన ఇతర వస్తువులు, సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నామని ఆ దేశ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.