FOOD : అటుకులతో ఎన్ని ఇన్​స్టంట్ రెసిపీలు చేయొచ్చో తెలుసా..?

-

బాగా ఆకలేస్తోంది. ఏమైనా చేసుకుందాం అంటే ఇంట్లో అటుకులు తప్ప ఏం లేవు. అటుకులతో ఏం చేస్తాం. మహా అయితే పోహా, లేదా చుడ్వ.. స్వీట్​గా తినాలనిపిస్తే అటుకుల పాయసం. కానీ ఆ సమయంలో మీకు అవేం తినాలి అనిపించడం లేదు. ఏదైనా వెరైటీగా తినాలని ఉంది. కానీ అటుకులు తప్ప ఏం లేవు. అప్పుడేం చేస్తారు. అటుకులతోనే టేస్టీ టేస్టీ కట్​లెట్.. వాహ్వా అనిపించే వడలు.. నోరూరించే పాయసం.. ఇన్​స్టంట్​ దోస తయారు చేయొచ్చు.

అటుకుల కట్​లెట్​

కావాల్సినవి: అటుకులు- కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు- అరకప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు- అరచెంచా, ఉల్లిపాయముక్కలు- నాలుగు చెంచాలు, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, కార్న్‌ఫ్లోర్‌- రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు- అరచెంచా, కారం- పావుచెంచా, గరంమసాలా- పావుచెంచా, జీలకర్రపొడి- పావుచెంచా, ఉప్పు- తగినంత, ఆమ్‌చూర్‌పొడి- పావుచెంచా, నూనె- తగినంత

తయారీ: రెండు చెంచాల అటుకులు తీసి పక్కన పెట్టుకొని తక్కినవాటిని నీళ్లుపోసి శుభ్రం చేసుకోవాలి. నీళ్లు వార్చేసి వాటిల్లో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, వెల్లుల్లి పలుకులు, ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు కారం, గరంమసాలా, జీలకర్రపొడి, ఆమ్‌చూర్‌పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. చివరిగా మొక్కజొన్న పిండి కూడా వేసుకొని బాగా కలిపి… పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కట్‌లెట్‌ మాదిరిగా ఒత్తుకోవాలి. ముందు పక్కన పెట్టుకొన్న అటుకుల్ని మిక్సీలో బరకగా ఆడించుకోవాలి. ఈ పొడిని కట్‌లెట్లకి పైపైన అద్దుకోవాలి. ఇప్పుడొక పాన్‌లో కొద్దిగా నూనె తీసుకుని ఈ కట్‌లెట్లని రెండువైపులా ఎర్రని రంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. టొమాటో సాస్‌తో తింటే… కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.

అటుకుల ఉప్మా

కావాల్సినవి: ఎర్ర అటుకులు- కప్పు, ఉల్లిపాయ- ఒకటి, క్యారెట్‌ తురుము- మూడు చెంచాలు, పచ్చిమిర్చి- నాలుగు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, అల్లం తురుము- అరచెంచా

తాలింపుకోసం: నూనె- చెంచా, ఆవాలు- అరచెంచా, మినప్పప్పు- చెంచా, సెనగపప్పు- రెండు చెంచాలు, కరివేపాకు- ఒక రెబ్బ

తయారీ: ఎర్ర అటుకుల్ని నీళ్లు పోసి శుభ్రం చేసి.. ఓ పావుగంటపాటు పక్కన పెట్టేయాలి. ఈలోపు స్టౌ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగాక… అల్లం తురుము, పచ్చిమిర్చి, క్యారెట్‌ తురుము వేసి చివరిగా ఉల్లిపాయముక్కలు, ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో తడిపి పెట్టుకున్న ఎర్ర అటుకులు వేసి కలుపుకోవాలి. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుని దింపేయడమే. చివరిగా అవసరం అయితే కాస్తంత నూనె వేసుకుంటే ఎర్ర అటుకుల ఉప్మా సిద్ధం.

ఇన్‌స్టెంట్‌ దోసె

కావాల్సినవి: అటుకులు- కప్పు, బొంబాయి రవ్వ- అరకప్పు, పెరుగు- పావుకప్పు, వంటసోడా- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- తగినంత

తయారీ: ఒక పాత్రలో అటుకులు, బొంబాయి రవ్వ కలిపి నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వని వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓ పావుగంటపాటు నానిన తర్వాత… వాటిని చేత్తో మెదుపుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి పెరుగు కలుపుకోవాలి. దీనిలో వంటసోడా వేసి ఓ పదినిమిషాలు పాటు ఉంచితే దోసెలు వేసుకోవడానికి పిండి సిద్ధమైనట్టే. అయితే పెనంపై వేసిన తర్వాత దోసెల పిండిలా ఎక్కువ స్ప్రెడ్‌ చేయకుండా ఉంటే బాగా వస్తాయి.

పాయసం

కావాల్సినవి: నెయ్యి- రెండు చెంచాలు, జీడిపప్పులు- ఎనిమిది, ఎండు ద్రాక్షలు- పది, అటుకులు- అరకప్పు, పాలు- రెండు కప్పులు, బెల్లం- అరకప్పు, నీళ్లు- మూడు చెంచాలు, పచ్చ యాలకులు- మూడు, అదనంగా రెండు చెంచాల అటుకులు, రెండు చెంచాల కొబ్బరిపొడి లేదా ఐదు జీడిపప్పులు తీసుకోవాలి.

తయారీ: ఒక పాత్రలో బెల్లాన్ని, మూడు చెంచాల నీళ్లను వేసి కరిగించుకుని బుడగలు వస్తున్నప్పుడు స్టౌ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగితే చాలు… తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. అదనంగా తీసుకున్న జీడిపప్పులు, అటుకుల్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక పాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. జీడిపప్పులు, ఎండుద్రాక్షల్ని నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ నేతిలోనే అటుకులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన అటుకుల పొడిని కూడా వేసుకుని మంచి వాసన వచ్చేంతవరకూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో పాలు పోసుకుని అటుకులు మెత్తబడేంతవరకూ ఉడికించుకోవాలి. అలాగే పాలు అడుగంటకుండా చూసుకుని, యాలకులు వేసుకోవాలి. అప్పుడు కరిగించిన బెల్లాన్ని వడకట్టి పెట్టుకుని ఆ మిశ్రమాన్ని పాలకు కలుపుకోవాలి. చివరిగా జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు వేసుకుంటే సరిపోతుంది.

వడ

కావాల్సినవి: అటుకులు- వడ, పెరుగు- పావుకప్పు, ఉప్పు- తగినంత, ఉల్లిపాయ చిన్నది- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, అల్లంపేస్ట్‌- అరచెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, బియ్యప్పిండి- రెండు చెంచాలు, నూనె- తగినంత, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు

తయారీ: అటుకుల్లో కాసిని నీళ్లు పోసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. కాసేపటికి మెత్త బడతాయి. కొద్దిగా చేత్తో అటుకులని మెదుపుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకొని అందులో తడిపిన అటుకులు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యప్పిండి వేస్తే అదనంగా ఉన్న తడిని పీల్చుకుంటుంది. వీటిని వడల మాదిరిగా ఒత్తుకుని నూనెలో వేయించుకోవడమే. అప్పటికప్పుడు రుచికరమైన వడలు సిద్ధమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news