దుర్గమ్మ నవరాత్రులలో రోజుకు 10వేల మందికే అనుమతి !

శ్రీకనకదుర్గమ్మ శరన్నవరాత్రులు అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఈసారి కొవిడ్‌తో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. దసరా సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రోజుకి 10 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు, ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. మూలనక్షత్రం రోజు మాత్రం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనం ఉంటుందన్నారు.

ఈ నవరాత్రి దర్శనాలకి సంబంధించిన దర్శన టికెట్స్ అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, భక్తులు ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే కచ్చితంగా టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. ‘టికెట్ లేకపోతే ఎవరిని కొండ పైకి అనుమతించం. కరోనా నేపథ్యంలో కేశకండనశాల ఉండదు. ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు నది హారతులు ఉంటాయి. ఆన్లైన్లో టికెట్ తీసుకుని దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా కొండపైకి రావాలి.

వీఐపీలు దసరా నవరాత్రులలో అందరికి టైం స్లాట్స్ పెడుతున్నాం. అందరూ ఆ స్లాట్స్లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి.. కోవిడ్ కారణంగా ఈ సారి దసరాకి కొన్ని ఆంక్షలు కొనసాగుతాయయని దుర్గ గుడి సురేష్ బాబు తెలిపారు. ‘ఈ సారి 9 రోజులు మాత్రమే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల్లో అమ్మవారికి 10 అలంకారాలు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకి 1000 మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తాం. దసరా 9 రోజులు ఎవరికి అంతరాలయం దర్శనం ఉండదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎవరికి కొండపైకి ఎలాంటి బస్ సౌకర్యం ఉండదు. అందరూ నడిచి రావాల్సిందే. దసరా నవరాత్రులకు సంబంధించి ఎటువంటి కరెంట్ బుకింగ్ ఉండదు.

శనివారం దేవాదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా 10, 60 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిని దర్శనానికి అనుమతించమని వెల్లడించారు.

– శ్రీ