పోషకాలు గల ఆహారాలు పది తీసుకునే బదులు ఒక్క పాలతోనే పది పోషకాలని పొందవచ్చని మీకు తెలుసా?

గతంలో పాలు తాగే పద్దతి వేరేగా ఉండేది. దాదాపుగా అందరి ఇళ్ళలో పాడి పశువులు ఉండేవి కాబట్టి తాజా పాలు ఎక్కువగా దొరికేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మరాయి. పాలల్లోనూ బ్రాండ్లు వచ్చాయి. పాశ్చరైజ్డ్ చేసిన పాలు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. చాలామంది పాలతో చేసిన పదార్థాలని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ, పాలను ఆహారంగా తీసుకోరు. ఐతే పాలల్లో ఉన్న పోషకాలు అనేకం. వివిధ రకాలైన పోషకాలని మి శరీరానికి అందించడానికి వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నవారు పాలల్లోనే అవన్నీ ఉన్నాయని గుర్తించండి.

పాలల్లోని పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాల్షియం, పొటాషియం, భాస్వరం, అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు ఎ, డి, బి12, రైబోఫ్లోవిన్ లతో కలిగి పాలల్లో అపారమైన పోషకాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాలని పోషకాహారాల గని అని చెప్పవచ్చు.

ప్రోటీన్

ఒక గ్లాసు పాలలో 8గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శరీరంలోని కండరాల, కణాల పెరుగుదలకు, నిర్వహణకు ఈ ప్రోటీన్లు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కేసిన్ పెరుగుదలకు సాయపడుతుంది. శరీర అభివృద్ధికి ఇవి చాలా అవసరం.

వ్యాధులతో పోరాటం

రోజుకో ఒక ఆపిల్ మిమ్మల్ని రోగాల బారి నుండి కాపాడుతుందని చెబుతున్న సంగతి తెలిసిందే. అలానే రోజుకో గ్లాసెడు పాలు మిమ్మల్ని వ్యాధులకి దూరం చేస్తాయనీ తెలుసుకోండి. పాలలో ఉండే లాక్టోస్ మీ కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెపోటు, రక్తపీడనాన్ని నియంత్రించడంలో పాలు సాయపడతాయి.

ఒత్తిడిని తగ్గిస్తాయి

పాలల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మీ కండరాలకి ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో పాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే రోజూ ఒక గ్లాసెడు పాలు తాగండి.