మొక్కజొన్నల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది మొక్కజొన్నలను రకరకాలుగా తింటుంటారు. కొందరు గారెలు ఇష్టపడితే, కొందరు ఉడకబెట్టుకుని తింటారు. ఇంక కొందరు మొక్కజొన్న పిండి చేసుకుని రొట్టెల రూపంలో తింటారు. అయితే మొక్కజొన్నల్లో మనకు అందుబాటులో ఉండే స్వీట్ కార్న్ వెరైటీతో కార్న్ సమోసాలను కూడా చేసుకోవచ్చు. ఇవి మనకు రుచికి రుచిని, పోషకాలకు పోషకాలను అందిస్తాయి. మరింకెందుకాలస్యం.. కార్న్ సమోసాలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కార్న్ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు:
స్వీట్ కార్న్ – 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1/4 కప్పు
ఉడికించి మెత్తగా చేసిన ఆలుగడ్డలు – 1/4 కప్పు
పచ్చిమిర్చి (తరిగినవి) – 1 టీస్పూన్
ఉప్పు – 1/4 టీస్పూన్
కారం – 1/4 టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర – తగినంత
ఆమ్‌చూర్ పౌడర్ – 1/4 టీస్పూన్
సమోసా స్ట్రిప్స్ – తగినన్ని
కార్న్ సమోసా తయారు చేసే విధానం:
పాన్ తీసుకుని అందులో నూనె వేసి.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు వేసి, అనంతరం ఉడికించిన ఆలుగడ్డల మిశ్రమం, స్వీట్ కార్న్ కూడా వేయాలి. ఆ తరువాత ఉప్పు, పసుపు, కారం, ఆమ్‌చూర్ పౌడర్, కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. సమోసా స్ట్రిప్ తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని నింపి జాగ్రత్తగా సీల్ చేయాలి. అనంతరం ఆ సమోసాలను నూనెలో వేసి వేయించాలి. అంతే.. వేడి వేడిగా ఉండే కార్న్ సమోసా రెడీ అయిపోతుంది.