Monsoon Special Recipes : మొక్కజొన్నతో ఈ రెసిపీలు ట్రై చేశారా..?

-

వర్షాకాలంలో ఓవైపు చిరుజల్లులు కురుస్తుంటే.. మరోవైపు మొక్కజొన్న కంకులను ఎర్రగా కాల్చి, ఉప్పు కారం, నిమ్మకాయ పూసి.. వేడివేడిగా తింటూ ఉంటే వచ్చే ఆనందం కోట్లతో కొలవలేనిది. మాటల్లో చెప్పలేనిది. దాంతో మాత్రమే సరిపెట్టుకోవడం ఎందుకు? మొక్కజొన్న గింజలతో మరికొన్ని రెసిపీలు ట్రై చేయండి. ఈ మాన్ సూన్ ని హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేయండి..

మసాలా గింజలు

కావాల్సినవి: మొక్కజొన్న గింజలు- కప్పు, బటర్‌- రెండు చెంచాలు, కారం- అరచెంచా, చాట్‌ మసాలా- పావుచెంచా, నిమ్మరసం- చెంచా, సన్నగా తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత

తయారీ: ముందుగా మొక్కజొన్న గింజలని ఉడికించుకుని ఈ నీళ్లని వార్చుకోవాలి. గింజలు వేడిగా ఉండగానే అందులో బటన్‌, చాట్‌ మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక వేళ చాట్‌ మసాలా అందుబాటులో లేకపోతే మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వంటివాటిని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

మొక్కజొన్న, టొమాటో పచ్చడి

కావాల్సినవి: టొమాటోలు- రెండు, మొక్కజొన్న గింజలు- అరకప్పు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, ఆవాలు- అరచెంచా, ఇంగువ- చిటికెడు, చింతపండు పేస్ట్‌- పావుచెంచా, నూనె- చెంచా, నిమ్మరసం- చెంచా

తయారీ: టొమాటోలని ఉడికించకుని పైనున్న తొక్కలని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్లు వంపకుండా అందులోనే ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు వేసి ఐదునిమిషాలపాటు ఉడికించుకోవాలి. చల్లారాక టొమాటోలు, ఉల్లిపాయ, మొక్కజొన్న గింజలు, చింతపండు, ఉప్పు వేసి అన్నింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కాక అందులో ఆవాలు, ఇంగువ, పసుపు వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు అందులో రుబ్బిపెట్టుకున్న పేస్ట్‌ వేసి ఐదునిమిషాలపాటు ఉడికించుకున్నాక దింపేసి చల్లారాక అందులో నిమ్మరసం వేసుకోవాలి. ఇడ్లీల్లోకి బాగుంటుంది.

పాయసం

కావాల్సినవి: స్వీట్‌కార్న్‌ గింజలు- కప్పు, పాలు- అరలీటర్‌, తురుమిన బెల్లం- అరకప్పు, నెయ్యి- మూడు చెంచాలు, యాలకులు- రెండు

తయారీ: రెండు చెంచాల గింజలని పక్కన పెట్టుకుని, తక్కిన వాటిని మిక్సీలో వేసి మెత్తగా మర పట్టించుకోవాలి. ఒక పాన్‌లో పాలు పోసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. మరో పాన్‌లో నెయ్యి వేసి మనం పక్కన పెట్టుకున్న మొక్కజొన్న గింజలని వేయించుకోవాలి. ఇష్టమైతే కాసిని ఎండుద్రాక్షలు, జీడిపప్పులు కూడా నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.  ఇదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసుకుని మిక్సీ పట్టి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని వేసి తక్కువమంట మీద పచ్చి పోయేంతవరకూ వేయించుకోవాలి. బాగా వేగాక ఇందులో మరిగించుకున్న పాలను పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం తురుము వేసి అది కరిగేంతవరకూ గరిటెతో తిప్పుకోవాలి. ఆ తర్వాతే వేయించిన గింజలు, జీడిపప్పులు, యాలకులు వేసుకోవాలి. కావాల్సిన చిక్కదనం వచ్చాక పై నుంచి కాసింత నెయ్యి వేసి స్టౌ కట్టేయాలి. రుచికరమైన కార్న్‌ పాయసం సిద్ధం.

దోసెలు

కావాల్సినవి: మొక్కజొన్న గింజలు- కప్పు, సెనగపిండి- ఐదు చెంచాలు, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, సన్నగా తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, నూనె- తగినంత

తయారీ: మొక్కజొన్న గింజలు, పచ్చి మిరపకాయలని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. అవసరమైతే కాసిని నీళ్లు కలుపుకోవచ్చు. ఒక పాత్రలో ఈ మిశ్రమం, సెనగపిండి, ఉప్పు, కొత్తమీర వేసి కలుపుకొంటే దోసెల పిండి సిద్ధం. ఇవి కొబ్బరి చట్నీతో రుచిగా ఉంటాయి.

వడలు

కావాల్సినవి: నానబెట్టిన సెనగపప్పు- అరకప్పు, మొక్కజొన్న గింజలు- కప్పు, పచ్చిమిర్చి- రెండు, అల్లం ముక్కలు- చెంచా, ఎండుమిర్చి- రెండు, ఉల్లిపాయముక్కలు- అరకప్పు, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- నాలుగు చెంచాలు, సెనగపిండి- పావుకప్పు, ఉప్పు- తగినంత, నూనె- తగినంత

తయారీ: ఒక పాత్రలో సెనగపప్పు, మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బరకగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని సెనగపిండి, కొత్తిమీర, జీలకర్ర, కొన్ని మొక్కజొన్న గింజలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకుని అందులో వడలు ఒత్తుకుని డీప్‌ ఫ్రై చేసుకోవాలి. గిన్నెలో అడుగున టిష్యూ పేపర్‌ వేసుకుంటే అధికంగా ఉన్న నూనె పీల్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news