బాదం పప్పులను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. బాదం పప్పుల్లో ఉండే పోషకాలు మన శరీరానికి బలాన్నిస్తాయి. నీరసం, నిస్సత్తువ నుంచి బయట పడేస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా బాదం పప్పులను తినడం వల్ల మనకు కలుగుతాయి. ఈ క్రమంలోనే బాదం పప్పుతో తయారు చేసే బాదం పప్పు బర్ఫీ కూడా మనకు బలాన్నిస్తుంది. మరి బాదం బర్ఫీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
బాదం బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు:
బాదం పప్పు – ఒకటిన్నర కప్పు
పాలు – 1/2 లీటర్
నెయ్య – 1/2 కప్పు
చక్కెర – 2 కప్పులు
క్రీం – 1/2 కప్పు
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
బాదం బర్ఫీ తయారు చేసే విధానం:
మొదట బాదం పప్పును 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానెబెట్టాలి. అనంతరం వాటి పొట్టు తీయాలి. తరువాత వాటిని నూరి మెత్తని ముద్దగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో పాలు తీసుకుని మరిగించాలి. అవి బాగా మరిగి, చిక్కగా తయారయ్యాక బాదం పప్పు ముద్దను అందులో వేయాలి. ఆ తరువాత మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ క్రమంలో మిశ్రమం దగ్గరకు అవుతుంది. అనంతరం అందులో నెయ్యి, చక్కెర, క్రీం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత మిశ్రమం దగ్గరకు అవగానే పాత్రను దింపాలి. అనంతరం ఒక పళ్లెంలో నెయ్యి రాసి దానిపై ఆ మిశ్రమాన్ని పోయాలి. గట్టిగా అయ్యాక బర్ఫీ బిళ్లల్లా కోసుకోవాలి. దీంతో బాదం బర్ఫీ తయారవుతుంది..!