కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు. అదేనండీ జన్మాష్టమి. ఇవాళ ఆ జగన్నాధుడికి ప్రత్యేక పూజలు చేసి బెల్లం, చక్కెర, పాలు కలిపి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇవే కాకుండా కన్నయ్యకు ఇష్టమైన అటుకుల పాయసం, రవ్వలడ్డూ నైవేద్యంగా సమర్పిస్తే కృష్ణుడి ఆనందపడి తన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ రెండు వంటకాలు చేయడం పెద్ద కష్టమేం కాదండోయ్. మొదలుపెడితే పది నిమిషాల్లో అయిపోతాయి. మరెందుకు ఆలస్యం. త్వరత్వరగా ఈ స్వీట్ రెసిపీలు చేసి.. కన్నయ్యకు నైవేద్యం సమర్పించండి.
రవ్వలడ్డూలు చేయడానికి కావాల్సిన పదార్థాలు
- బొంబాయి రవ్వ – రెండు కప్పులు
- పాలు – అర కప్పు
- నెయ్యి – మూడు స్పూన్లు
- ఎండు కొబ్బరి పొడి – ఒక కప్పు
- చక్కెర – ఒకటిన్నర కప్పు
- యాలకుల పొడి – అర స్పూను
- కిస్‌మిస్‌లు – పావు కప్పు
- జీడిపప్పులు – పది
తయారీ విధానం. కడాయిలో నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేయించాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. అవి వేగాక చక్కెర వేసి వేయించాలి. చక్కెర బాగా కరిగి మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. యాలకుల పొడి కూడా వేసి కలపాలి. మొత్తం మిశ్రమం చల్లార బెట్టాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను రవ్వ మిశ్రమంలో కలపాలి. రవ్వ మిశ్రమం చల్లారాక కొంచెం పాలు పోసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా లడ్డూల్లా చుట్టుకోవాలి. అంటే తియ్యటి కొబ్బరి రవ్వ లడ్డూలు నివేదనకు రెడీ అయినట్టే.
అటుకుల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
- అటుకులు – ఒక కప్పు
- పాలు – రెండు కప్పులు
- బెల్లం తురుము – ఒక కప్పు
- నీళ్లు – రెండు కప్పులు
- ఎండుకొబ్బరి తురుము -మూడు కప్పులు
- యాలకుల పొడి – అర టీస్పూను
- జీడిపప్పులు – అయిదు
- నెయ్యి – రెండు స్పూనులు
- బాదం పప్పులు – అయిదు
తయారీ ఇలా.. కడాయిలో అటుకులు వేసి వేయించి పక్కకి తీసుకుపెట్టుకోవాలి. అదే కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పులు, ఎండుకొబ్బరి తురుము లేదా ముక్కలు వేసి వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత బెల్లం, నీళ్లు వేసి కరిగే వరకు ఉడికించాలి. బెల్లం కరిగిన తర్వాత నీటిని వడపోసుకుంటే మలినాలేమైనా ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. ఆ పాలు మరిగాక అటుకులను వేసి ఉడికించాలి. అటుకుల మెత్తగా అయ్యేవరకు ఉడికించాక బెల్లం నీటిని కలపాలి. అందులో యాలకుల పొడిని కలపాలి. ముందుగా కడాయిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం, కొబ్బరి ముక్కలు అటుకుల మిశ్రమంలో వేయాలి. చిక్కగా పాయసంలా ఉడికించుకున్నాక స్టవ్ కట్టేయాలి. తియ్యటి అటుకుల పాయసం రెడీ అయినట్టే. కావాలంటే వేడి నెయ్యి పైన వేసుకోవచ్చు.