హైదరాబాద్ నుంచి వస్తుంటే.. సూర్యాపేటలో సోలాపూర్ సింగ్ మిక్చర్ బండి ఉంటుంది. అది ఎంత ఫేమస్ అంటే.. ఇక్కడ చేసే మిక్చర్ ను విదేశాలకు సైతం పార్శిల్ చేస్తారు. రాష్ట్రంలో నలుమూలకు డైలీ 100కు పైగా పార్శిల్స్ వెళ్తాయట. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కూడా పట్టుకెళ్తారు. ఒక్కసారి ఈ మిక్చర్ టేస్ట్ చేశారంటే.. పిల్లలకు ఇక ఆ రూట్ నుంచి వెళ్తుంటే.. మిక్చర్ లేకుండా రానివ్వరు. తెలిసివాళ్లు వస్తున్నా.. అరే కొంచెం సూర్యాపేటలో పీఎస్ఆర్ సెంటర్ కి వెళ్లి సింగ్ మిక్చర్ కట్టించుకురా అంటారట..!
సూర్యాపేటలో సోలాపూర్ సింగ్ మిక్చర్‌కు ఉన్న పాపులారిటీ మూములుగా లేదు.. 70 ఏళ్లుగా నడుస్తోన్న మిక్చర్ సెంటర్ మరీ.. గుజరాత్ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇక్కడే ఎన్నో వ్యాపారాలు చేశారు.. ఏదీ కలిసి రాలేదు. ఏదో చిన్న పనిమీద మహారాష్ట్రలోని సోలాపూర్ వెళ్లిన లక్ష్మీ నారాయణ సింగ్ అక్కడ మిక్చర్ రుచి చూశాడు. ఎలా తయారు చేస్తారో కొన్ని రోజులు అక్కడే ఉండి నేర్చుకున్నాడట. సూర్యాపేట వచ్చాక సొంతంగా చిన్నగా ఓ తోపుడు బండి మీద అమ్మడం మొదలుపెట్టాడు. ఐదు పైసలతో ప్రారంభించాడు. నేడు మూడో తరం వారు అందిపుచ్చుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
లక్ష్మీనారాయణ సింగ్ తర్వాత ఆయన కోడలు లక్ష్మీబాయి సింగ్ దీన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసిన కొడుకు ఉపేందర్ సింగ్ సైతం ఇందులోకి వచ్చాడు. తల్లీ కొడుకులు మిక్చర్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. చెగోడి మిక్చర్, మిర్చీ మిక్చర్, ఆలూ మిక్చర్, ఆలూ మసాలా, మిర్చీ మసాలా, కట్ మిర్చీ.. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సింగ్ మిక్చర్‌గా ప్రజల్లో బాగా ఆదరణ పొందింది.
మిక్చర్ డ్రై పార్సిల్ విదేశాలకు కట్టించుకుంటారు. ఇదీ ఐదు నుంచి ఆరు నెలల దాకా ఉంటుంది. మసాలాను వేసి అన్ని ఐటెమ్స్ కలిపి పార్సిల్ కడతారు. దీనికి మనం ఇంట్లో ఉల్లిపాయలు, నిమ్మకాయ కలిపితే సరి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చెగోడీ, సన్నకారప్పూస, మిర్చీబజ్జీ.. ఇలా వీటన్నింటినీ ఇంట్లోనే సొంతంగా తయారు చేస్తారు. అలాగే, ఇందులో కలిపే గరం మసాలాను ప్రత్యేకించి సొంత దినుసులతో తయారుచేసుకుంటారట..అందుకే అంత మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలు, క్యారెట్, బీట్‌రూట్ ముక్కలు జత చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రోజుకు 100 వరకు ఇక్కడి నుంచి పార్సిళ్లు వెళ్తాయి.. శుభకార్యాలకు కూడా ప్రత్యేకంగా ఆర్డుర్లు వస్తాయట. ఇది మిర్చిబండి కథ.. ఎంత రుచిగా ఉండకపోతే.. అంత డిమాండ్ ఉంటుంది.. ఈసారి మీరు కూడా సూర్యపేట నుంచి వస్తుంటే..ఓ పట్టుపట్టండి మరీ..!