రంజాన్ మాసంలో నోరూరించే షీర్ కుర్మా.. తయారు చేసుకోండిలా..

ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెలలో తీపి పదార్థాలు తినడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. అందులో షీర్ కుర్మాకి ప్రత్యేక స్థానం ఉంది. బాదం గింజలు సహా అనేక పదార్థాలు కలిపి మొత్తానికి నోరూరించే షీర్ కుర్మా రెడీ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం ఈ షీర్ కుర్మా తయారీ గురించి తెలుసుకుందాం. సాయంత్రం పూట ఉపవాసం విడిచే సమయంలో ఇష్టంగా తినేందుకు షీర్ కుర్మా ఉంటే ఆ రుచే వేరు. మరి అది తయారు చేసుకోవడమెలా అని ఆలోచించేవాళ్ళు ఇది చదవండి.

షీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు.

ఎంతమంది తినాలన్న దాన్ని బట్టి షీర్ కుర్మా ఎంత చేసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జనరల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

అరలీటరు పాలు
టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
వందగ్రాముల వర్మిసెల్లి
2టేబుల్ స్పూన్ల సూర్యపువ్వు గింజలు
అరచెంచా పచ్చ యాలకుల పొడి
తరిమిన జాజికాయ చిటికెడు
కావాల్సినంత చక్కెర
మూడు లేదా నాలుగు పగలగొట్టిన బాదం పలుకులు
3-4 పగలగొట్టిన పిస్తా పలుకులు
కొంచెం కుంకుమ పువ్వు

తయారు చేయు పద్దతి

ముందుగా పాలని తీసుకుని మరగబెట్టాలి. ఆ పాలు అందులో పావు వంతు తగ్గేవరకు పొయ్యి మీద మరిగిస్తూనే ఉండాలి.

మరొక పొయ్యిమీద పాత్రని పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి, అది వేడికాగానే వర్మిసెల్లిని అందులో వేయించాలి. ఎర్రగా అయిన తర్వాత పావు వంతు తగ్గిన పాలల్లో వెర్మిసెల్లిని వేయాలి.

కొంచెం కుంకుమ పువ్వు, సూర్యపువ్వు విత్తనాలు, యాలకుల పొడి, తురిమిన జాజికాయని దానికి కలపాలి. ఐదు నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచాలి.

కావాల్సినంత చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు కలుపుకుని, ఇంకా ఏమైనా గింజలు యాడ్ చేసుకోండి.

ఆ తర్వాత రుచికరమైన వేడివేడిగా ఉండే షీర్ కుర్మాని చిన్న పాత్రల్లో పోసుకుని మీకు కావాల్సిన వాళ్ళకి అందించండి.